బ్రిటన్‌లో ఫిబ్రవరి వరకు లాక్‌డౌన్‌

6 Jan, 2021 03:39 IST|Sakshi

నేటి నుంచి అమల్లోకి    విద్యాసంస్థలన్నీ బంద్‌

70% వేగంతో కరోనా కేసులు వ్యాప్తి 

ఇల్లు కదిలి బయటకు రావొద్దు: ప్రధాని జాన్సన్‌  

లండన్‌: యూకేలో కరోనా కొత్త స్టెయిన్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులు పెరిగిపోతూ ఆస్పత్రులపై ఒత్తిడి అధికం కావడంతో ప్రభుత్వం బుధవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇల్లు కదిలి బయటకు రావద్దని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి మధ్య వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితుల్ని సమీక్షించాక ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటారు. ‘70 శాతం వేగంతో కరోనా కేసులు వ్యాప్తిచెందుతున్నాయి.  జనాభాలో అత్యధిక శాతం కరోనా బారిన పడే అవకాశం ఉంది’ అని జాన్సన్‌ అన్నారు.

ఇంటి నుంచి పని చేసే అవకాశం లేనివారు, నిత్యావసరాలు వైద్య అవసరాల కోసం, కరోనా టెస్ట్‌ చేయించుకోవడానికి, గృహ హింస ఎదుర్కొన్నప్పుడు, వ్యాయామం కోసం బయటకు రావచ్చునని జాన్సన్‌ స్పష్టం చేశారు. గత మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ ఇప్పుడు కూడా వర్తిస్తాయని జాన్సన్‌ వెల్లడించారు. ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తే, స్కాట్‌లాండ్‌లో నెలకొన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా మంగళవారం నుంచే లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. పాఠశాలలు, దుకాణాలు మూసివేశారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సమావేశమై లాక్‌డౌన్‌కు ఆమోద ముద్ర వేయనుంది.   

లెవెల్‌5కి కరోనా  
యూకే వ్యాప్తంగా కోవిడ్‌–19 లెవల్‌ 5కి చేరుకుంది. కరోనా లెవల్స్‌లో ఇదే అత్యధిక స్థాయి. ఇప్పుడే తక్షణ చర్యలు తీసుకోకపోతే మరో 21 రోజుల్లో కరోనా జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌హెచ్‌ఎస్‌) చేతులు కూడా దాటిపోయే అవకాశం ఉంది. దీంతో బ్రిటన్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సిఫారసుతో యూకే వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. గత వారం రోజులుగా రోజుకి 50 వేలకు పైగా  కేసులు నమోదవుతుంటే, ఇంగ్లండ్‌లో కొన్ని ఆస్పత్రుల్లో ప్రతీ 10 పడకల్లో ఆరింట్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. క్రిస్మస్‌ తర్వాత కరోనాతో ఆస్పత్రుల పాలయ్యే రోగుల సంఖ్య 50% పెరిగితే మరణాలు 20 శాతం పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే  60,916 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు యూకే వ్యాప్తంగా 27 లక్షలకు పైగా కేసులు నమోదైతే, 76 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  

టీకాపైనే ఆశలు 
కరోనా కట్టడికి బ్రిటన్‌ ప్రభుత్వం టీకాపైనే ఆశలు పెట్టుకుంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఫైజర్, కోవిషీల్డ్‌  రెండు టీకాలు ప్రజలకి ఇస్తున్నారు. ‘‘రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. అయినప్పటికీ ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో సహకరించాలి. కరోనా వ్యాక్సిన్‌ పని చేస్తుందన్న విశ్వాసం ఉంది. మనం యుద్ధానికి చివరి దశకి చేరుకున్నాం’’ అని జాన్సన్‌ అన్నారు.

పరీక్షలపై ఫిబ్రవరిలో నిర్ణయం  
బ్రిటన్‌ వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలన్నీ మూసివేశారు. విద్యార్థులందరూ ఇక ఇళ్లలోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే–జూన్‌లలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా మళ్లీ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి తెరవడం, పరీక్షల నిర్వహణపై ఫిబ్రవరి 15 తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

భారత పర్యటన వాయిదా  
భారత్‌లో జనవరి 26న జరిగే గణతంత్రదిన వేడుకలకి హాజరు కావాల్సిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. భారత ప్రధాని మోదీతో మంగళవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు.   దేశంలో కొత్త కరోనా కేసులు ఉ«ధృతరూపం దాల్చడంతో తాను భారత్‌కి రాలేకపోతున్నానంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్‌కి వస్తానని జాన్సన్‌ హామీ ఇచ్చారు.

యూకే ఆధ్వర్యంలో ఈ ఏడాది చివర్లో జరిగే జీ–7 సదస్సు కంటే ముందుగానే భారత్‌కి వస్తానని చెప్పారు. బోరిస్, మోదీ మధ్య జరిగిన సంభాషణను బ్రిటన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ సమయంలో తాను బ్రిటన్‌లో ఉండడం అత్యవసరమని జాన్సన్‌ చెప్పారు. కలసికట్టుగా కరోనాపై పోరాటం చేయాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని అవగాహనకు వచ్చినట్టుగా ప్రతినిధి తెలిపారు.

>
మరిన్ని వార్తలు