England: లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!

15 May, 2021 11:09 IST|Sakshi

తర్జన భర్జనలో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: గతేడాది ఇంగ్లాండ్‌ దేశాన్ని కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశం కరోనాపై విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ అమలులో ఆంక్షలను ఎత్తివేయాలా... వద్దా అని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా  ఉంది. ఈ సమయంలో  లాక్‌డౌన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ శుక్రవారం అభిప్రాయపడ్డారు. అయితే బ్రిటన్‌ ప్రభుత్వం సోమవారం లాక్‌డౌన్‌పై కొన్ని ఆంక్షలను ఎత్తివేయనుండగా.. మిగతా వాటిని జూన్‌ 21వ తేదీన ఎత్తివేయాలని నిర్ణయించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించవచ్చు బోరిస్‌ జాన్సన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను సురక్షితంగా ఉంచడానికి తమ ప్రభుత్వం ఏదైనా చే‍స్తుందని తెలిపారు. ఇంగ్లాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..బీ1.617.2 కరోనా వేరియంట్‌ ఆ దేశ వాయువ్య ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీనిని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో 50 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేసే ప్రక్రియ వేగం పెరిగిందని, ఇది కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుదని జాన్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రకం కరోనా వేరియంట్‌ మిగతా వాటి కంటే వేగంగా వ్యాప్తిసుందా..లేదా అనే సమాచారం కోసం తమ ప్రభుత్వం వేచి ఉందని చెప్పారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి అంతగా లేకుంటే మళ్లీ దేశంలో కార్యక్రమాలు పునః ప్రారంభమవుతాయని జాన్సన్‌ తెలిపారు. 

కాగా శాస్త్రవేత్తలు కరోనా సెకండ్‌ వేవ్‌ తొందరగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కానీ ఎంతవరకు నిజం అనేది పరిశోధనల్లో తెలియాల్సి ఉందని బ్రిటన్‌ ప్రధాన వైద్య అధికారి క్రిస్‌ విట్టి వెల్లడించారు. దీనిపై లండన్‌లోని క్వీన్‌ మేరీ విశ్వవిద్యాలయంలో ఎపీడెమియాలజీ సీనియర్‌ లెక్చరర్‌ దీప్తి గురుదాసిని మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో మరిన్ని ఆంక్షలను విధించాలి’ అని​ చెప్పారు. కరోనా కేసులు గతవారం 520 నుంచి ఈ వారం 1,313కి పెరగడంతో ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
 
మా టీకాలను నమ్మండి
‘‘బ్రిటన్‌లో కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. దానికి కారణం వ్యాక్సిన్‌లు, అవి కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మా టీకాలు కరోనాను ఎదుర్కోవడంలో తక్కువ ప్రభావం కలిగిస్తాయని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో బ్రిటన్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ ఎదుర్కొన్నప్పటి కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దానికి కారణం వ్యాక్సినేషన్‌. కాబట్టి వ్యాక్సిన్‌లపై నమ్మకం ఉంచాలి.’’ అని జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. కాగా బ్రిటన్‌లో కరోనా ఉధృతి తగ్గుతుండడంతో క్రమంగా ఆ దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో బ్రిటన్‌కి వచ్చే ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది. భారత్‌ నుంచి ప్రయాణికులు వస్తే బ్రిటన్‌ ప్రభుత్వం కొన్నిరోజులపాటు  వారిని హోటల్‌లో ఉంచుతోంది.

(చదవండి: ఆన్‌లైన్‌ ఉగ్రవాదంపై పోరుకు అమెరికా మద్దతు)


 

>
మరిన్ని వార్తలు