Johnson Government: సంక్షోభంలో జాన్సన్‌ సర్కారు

6 Jul, 2022 01:39 IST|Sakshi
సాజిద్‌ జావిద్‌, బోరిస్‌ జాన్సన్‌, రిషి సునక్‌

సీనియర్‌ మంత్రులు సునక్, సాజిద్‌ రాజీనామా  

లండన్‌: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్‌ జాన్సన్‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్‌ (42)తో పాటు పాక్‌ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కలకలం రేపుతోంది. పార్టీ గేట్‌ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్‌ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్‌లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్‌ పనితీరు దారుణమంటూ లేఖలో సునక్‌ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్‌గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టారు.

‘‘చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రధాని నాయకత్వంలో పని చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని సాజిద్‌ కూడా లేఖలో పేర్కొన్నారు. తానిక మళ్లీ మంత్రి చేపట్టకపోవచ్చని సునక్‌ చెప్పగా, జాతీయ ప్రయోజనాలను కన్జర్వేటివ్‌ పార్టీ సమర్థంగా కాపాడుతుందన్న ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయామంటూ సాజిద్‌ తన లేఖలో పదునైన విమర్శలు చేశారు.

జాన్సన్‌ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని తేల్చేశారు. వారి రాజీనామాకు ముందు మంగళవారం రోజంతా భారీ పొలిటికల్‌ డ్రామా నడిచింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ ఎంపీ క్రిస్‌ పించర్‌ను డిప్యూటీ చీఫ్‌ విప్‌గా కీలక పదవిలో నియమించడం పొరపాటేనంటూ జాన్సన్‌ ప్రకటన చేశారు. అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ వెంటనే జాన్సన్‌ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్‌ ఇప్పటికే పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఆయనకు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్‌ బొటాబొటిగా బయటపడ్డారు.  

మరిన్ని వార్తలు