తుది అంకానికి చేరువైన బ్రిటన్‌ ఎన్నిక ప్రక్రియ

2 Sep, 2022 05:14 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతను ఎన్నుకునే కీలక ఎన్నిక ప్రక్రియ తుది అంకానికి చేరువైంది. మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునాక్, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌లమధ్య పోరు చివరి దశకు దగ్గరైంది. సొంత కన్జర్వేటివ్‌ పార్టీ (టోరీ) సభ్యుల మద్దతు కోసం ఇద్దరూ చివరిసారిగా అభ్యర్థించి గురువారం ప్రచారాన్ని ముగించారు. లండన్‌లోని వింబ్లేలో చివరి ప్రచార ప్రసంగం సందర్భంగా సునాక్‌ తన భార్య, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సునాక్‌ తండ్రి యశ్‌వీర్‌ వైద్యుడు. తల్లి ఉషా ఫార్మసిస్ట్‌. ‘‘ప్రజాసేవలోకి అడుగుపెట్టేలా వాళ్లు నాకెంతగానో స్ఫూర్తినందించారు.

పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మానాన్నలకు రుణపడి ఉంటా. సన్మార్గంలో నడిపించి, కష్టపడే తత్వం నేర్పించి, కుటుంబం కోసం శ్రమించే సామర్థ్యాలను అందించారు’’ అన్నారు. అక్షిత ఓ అద్భుతమైన, ప్రేమమయ సతీమణి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తారు. భార్య, తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ ఘనమైన దేశంలో సాధించలేనిదంటూ ఏదీ లేదంటూ ముగించారు. బ్రిటన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరగడం, నేరాలు, పన్నులు పైకి ఎగబాకడం, వలస విధానంలో సంస్కరణలు, విదేశాంగ విధానం తదితరాలపై సునాక్, ట్రస్‌ తమ ప్రాధాన్యాలను పేర్కొంటూ ప్రచార పర్వాన్ని ముగించారు.

శుక్రవారం పోలింగ్, సోమవారం ఫలితాలు
కన్జర్వటివ్‌ పార్టీ సభ్యులు శుక్రవారం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం ఐదింటిదాకా పోలింగ్‌ కొనసాగుతుంది. సోమవారం ఫలితాలను వెల్లడిస్తారు. పలు సర్వేల ప్రకారం సునాక్‌ కంటే ట్రస్‌ ఈ రేసులో ముందునట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ఎలిజబెత్‌ రాణి ఈసారి లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి కాకుండా స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ కోట నుంచి తదుపరి ప్రధానిని ప్రకటిస్తారు. రాణి ప్రస్తుతం ఈ కోటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు