అత్యంత దురదృష్టవంతులు వీరే.. ఏకంగా రూ.31 కోట్లు మిస్సయ్యారు

19 Oct, 2021 08:41 IST|Sakshi

బ్రిటన్‌లో చోటు చేసుకున్న సంఘటన

లండన్‌: లాటరీ టికెట్‌ అంటే ఓ రకంగా చెప్పాలంటే జూదం. లక్షల్లో టికెట్‌ కొంటే ఒక్కరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అలా మన ఇంటికి వచ్చిన అదృష్టాన్ని.. మన చేతులారా మనమే పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది.. ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు బ్రిటన్‌కు చెందిన మార్టిన్‌ టాట్‌ అతడి భార్య కే. వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో వీరికంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరని జాలిపడుతున్నారు.

కారణం ఏంటంటే ఈ జంట కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. అది కూడా ఏ కోటి, రెండు కోట్లో కాదు.. ఏకంగా 31 కోట్ల రూపాయలు. కానీ ఏం లాభం వారి దగ్గర ఆ టికెట్‌ లేదు. లాటరీ తగిలిన ఆనందం కన్నా టికెట్‌ పొగుట్టుకున్న విషమే వారిని ఎక్కువ బాధించింది. 20 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పటికి వారిని ఎంతో బాధిస్తుంది. ఆ వివరాలు..
(చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు)

ఇరవై ఏళ్ల అనగా 2001 సంవత్సరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్టిన్‌, అతడి భార్య కే ప్రతి వారం లాటరీ గేమ్‌లో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఓ సారి అదృష్టం బాగుండి కే కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. దాని విలువ ఏకంగా 31 కోట్ల రూపాయలు. ఇక తమ కష్టాలు అన్ని తీరిపోతాయి.. కోటీశ్వరులం అవుతామని కలలు కంటున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కే కొన్న లాటరీ టికెట్‌ కనిపించకుండా పోయింది.

ఈ క్రమంలో కే లాటరీ నిర్వహిస్తున్న యాజమాన్యం దగ్గరకు వెళ్లి.. తాను కొన్న టికెట్‌కే లాటరీ తగిలిందని.. కావాలంటే తన టికెట్‌ నంబర్‌ని కంప్యూటర్‌లో చెక్‌ చేయవచ్చని కోరింది. కానీ సదరు కంపెనీ ససేమిరా అన్నది. టికెట్‌ని తీసుకువచ్చి చూపిస్తేనే ప్రైజ్‌మనీని ఇస్తామని స్పష్టం చేసింది. 30 రోజుల్లోపు పోగొట్టుకున్న టికెట్‌ని తీసుకువస్తే.. ప్రైజ్‌మనీని వారికి అందజేస్తామంది. కానీ దురదృష్టం కొద్ది టికెట్‌ దొరకలేదు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. చేతికొచ్చిన ముద్ద నోటికందకుండా పోయిందే అంటూ కే దంపతుల పరిస్థితిపై జాలి పడ్డారు జనాలు. 
(చదవండి: యూరోకప్‌ టోర్నమెంట్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు)

ఈ లాటరీ ప్రైజ్‌మనీ కోసం కే దంపతులు ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేశారు. కానీ లాభం లేకుండాపోయింది. ఈ క్రమంలో వారి మధ్య బంధం కూడా బీటలు వారింది. 31 కోట్ల రూపాయలు చేతికందకుండా పోయాననే బాధతో ఇరువురు ఒకరినొకరు దూషించుకోసాగారు. అలా వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. చివరకు వారిద్దరు విడాకులు తీసుకున్నారు. పాపం లాటరీ ప్రైజ్‌మనీ దక్కలేదు.. ఇటు వివాహ బంధం నిలవలేదు. వీరి గురించి విన్న ప్రతి ఒక్కరు ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు వీరేనని సానుభూతి చూపుతారు. 

చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు

మరిన్ని వార్తలు