Rishi Sunak Seat Belt Issue: సీట్‌ బెల్ట్‌ వివాదం.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా

21 Jan, 2023 10:09 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్‌ బెల్ట్‌ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్‌ విధించినట్లు లంకాషైర్‌ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్‌ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో వివాదం రాజుకుంది.

ప్రధాని అయ్యి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ రిషిసునాక్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. సీటుబెల్ట్‌ ధరించకుండా ప్రయాణించడం తప్పేనని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు.

అయితే యూకే చట్టాల ప్రకారం బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుండే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది.
చదవండి: గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది

మరిన్ని వార్తలు