'బ్రిటిష్‌-పాకిస్తానీ మగవాళ్లు ఇంగ్లీష్ అమ్మాయిలను దారుణంగా'.. హోంమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం..

6 Apr, 2023 16:19 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బ్రిటిష్‌-పాకిస్తానీ పురుషులే దేశంలో తీవ్ర నేరాల్లో భాగం అవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంగ్లీష్ మహిళలను వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం సహా డ్రగ్స్, హాని తలపెట్టే పనుల్లో పాక్ సంతతికి చెందిన బ్రిటన్ పురుషులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు, ఇంగ్లీష్ యువతులను లక్ష‍్యంగా చేసుకుని వీరు వికృత చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

'మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే..  సంరక్షణ కేంద్రాలు, జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న బలహీనమైన తెల్ల ఇంగ్లీష్ అమ్మాయిలు, పిల్లలను బ్రిటిష్-పాకిస్తానీ పురుషుల ముఠాల వేధిస్తున్నాయి.  వారిని వెంబడించి అత్యాచారం చేయడం, మత్తుపదార్థాలు ఇవ్వడం, హాని చేయడం వంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నాయి. నిందితుల్లో సంరక్షణ కేంద్రాల్లో పని చేసేవారు ఉంటున్నారు. మరికొందరికి పెద్ద నెట్‌వర్క్ ఉంది. చాలా మంది నేరస్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు.

అధికారులు ఈ నేరస్థులకు భయం కల్గించేలా చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనో లేక భయంతోనో, జాత్యహంకారం, మతోన్మాదం అనుకుంటారనో అధికారులు వీరిని గుడ్డిగా వదిలేస్తున్నారు.' అని బ్రవర్న్ అన్నారు. 

'కొన్ని జాతి సమూహాల ప్రాబల్యం గురించి చాలా కాలంగా అనేక నివేదికలు ఉన్నాయి. బ్రిటిష్ పాకిస్తానీ పురుషులు బ్రిటిష్ విలువలకు పూర్తిగా విరుద్ధమైన  సాంస్కృతిక విలువలను కలిగి ఉంటారు. వారు స్త్రీలను అవమానిస్తారు. కాలం చెల్లిన సంప్రదాయాలు పాటిస్తారు.  కొన్నిసార్లు వారి ప్రవర్తన హేయంగా ఉంటుంది' అని హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు పిల్లలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచమైన నేరస్థుల ముఠాల పనిపట్టేందుకు కొత్తటాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.
చదవండి: చైనాను రెచ్చగొట్టిన తైవాన్‌.. సరిహద్దులో ఉద్రిక్తత

మరిన్ని వార్తలు