దేశ ప్రధానికి జీతం చాలట్లేదట! 

21 Oct, 2020 06:54 IST|Sakshi

లండన్‌: ఒక దేశ ప్రధాని అంటే మామూలు విషయం కాదు. అధికారం, హోదా, సంపాదన ఇలా ఏ రకంగా చూసినా అబ్బో అనిపించే పోస్టు! కానీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విషయం ఇందుకు విరుద్ధంగా ఉంది. తనకు వచ్చే జీతం సరిపోక ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని జాన్సన్‌ యోచిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన డైలీ మిర్రర్‌ ఒక కథనంలో వెల్లడించింది.

బ్రెగ్జిట్‌ అనంతరం జాన్సన్‌ దిగిపోయేందుకు రెడీగా ఉన్నట్లు ఒక పార్లమెంట్‌ మెంబర్‌ చెప్పారని తెలిపింది. జాన్సన్‌కు ప్రధానిగా వచ్చే వేతనం కన్నా గతంలో ఆయన చేసిన ఉద్యోగంలోనే ఎక్కువ జీతం వస్తుందట! ఆయన గతంలో టెలిగ్రాఫ్‌ పత్రికలో కాలమిస్టుగా చేసేవారు. అప్పుడు తనకు ఏటా 2.75 లక్షల పౌండ్లు వచ్చేవి. దీనికితోడు నెలకు రెండు ప్రసంగాలివ్వడం ద్వారా సుమారు 1.6 లక్షల పౌండ్లు ఆర్జించేవారు.  (ఫౌచీ ఒక ఇడియట్‌: ట్రంప్)

ప్రధాని అయ్యాక 1.5 లక్షల డాలర్లే వేతనంగా పొందుతున్నారు. దీనివల్ల ఆయన కనీస అవసరాలు కూడా తీరట్లేదట. బోరిస్‌కు ఆరుగురు పిల్లలున్నారు. విడాకులు ఇచ్చిన ఒక భార్యకు భరణం ఇవ్వాలి. తనకు వచ్చే జీతంతో ఈ ఖర్చులు భరించలేక బోరిస్‌ వాపోతున్నారట. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంట్లో కనీసం హౌస్‌కీపర్‌ కూడా లేదని, అసలా ఇల్లే పెద్ద మురికికూపమని బోరిస్‌ స్నేహితులు చెప్పినట్లు కథనం పేర్కొంది.  బోరిస్‌కు ముందు ప్రధానిగా ఉన్న థెరిసా మే ప్రస్తుతం లెక్చర్లిస్తూ దాదాపు 10 లక్షల పౌండ్లు వెనకేశారని డైలీ మిర్రర్‌ వెల్లడించింది 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు