భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యానికి సై: బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌

30 Nov, 2022 05:14 IST|Sakshi

లండన్‌: భారత్‌–బ్రిటన్‌ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్‌ నూతన ప్రధాని రిషీ సునాక్‌ మరోమారు స్పష్టంచేశారు. ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ విధానంపై బ్రిటన్‌ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్‌ మేయర్‌ బ్యాంకెట్‌ కార్యక్రమంలో సోమవారం సునాక్‌ ప్రసంగించారు.

‘ ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్‌ ముందునుంచీ మద్దతు పలుకుతోంది.  రాజకీయాల్లోకి రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం. 2050కల్లా ప్రపంచవాణిజ్యంలో సగం వాటాను ఇండో–పసిఫిక్‌ హస్తగతం చేసుకుంటుంది. అందుకే ఇండో–పసిఫిక్‌ సమగ్రాభివృద్ధి ఒప్పందం(సీపీటీపీపీ)లో భాగస్వాములం అవుతున్నాం. ఇందులోభాగంగా భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషిచేస్తున్నాను’ అని సునాక్‌ అన్నారు.

చైనాతో స్వర్ణయుగ శకం ముగిసినట్లే
‘చైనాతో బ్రిటన్‌ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక, రాజకీయ సంస్కరణలు, సత్సంబంధాలకు దారితీయాలి. కానీ చైనా రాజ్యవిస్తరణవాదం, ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు. చైనాతో బ్రిటన్‌ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్లే’ అన్నారు.

మరిన్ని వార్తలు