యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన బుల్‌గారీ

26 Mar, 2022 10:30 IST|Sakshi

ఇటలీకి చెందిన ప్రముఖ వాచీల తయారీ సంస్థ బుల్‌గారీ తాజాగా సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ మందంగల మెకానికల్‌ చేతి గడియారాన్ని రూపొందించి యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ద బుల్‌గారీ ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా పేరిట మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రత్యేక ఎడిషన్‌ వాచీ మందం ఎంతో తెలుసా.. 1.8 మిల్లీమీటర్లు మాత్రమే! దీన్ని మరోలా చెప్పాలంటే ఈ వాచీ మందం యూరో, ఆస్ట్రేలియా, అమెరికా కరెన్సీలకు చెందిన 10, 20, 5 సెంట్ల నాణేలకన్నా తక్కు వగా ఉండటం విశేషం.

ఈ వాచీలో ఇదొక్కటే ప్రత్యేకత కాదండోయ్‌... దీని డిజైన్‌ మొదలు అందులో వాడిన పదార్థాల వరకు అన్నీ విభిన్నమైనవే. అష్టభుజి ఆకారం లోని ఈ వాచీ చట్రం, బ్రేస్‌లెట్‌ను టైటానియంతో, అడుగు భాగాన్ని టంగ్‌స్టన్‌ కార్బైడ్‌తోనూ తయారు చేశారు. వాచీ లోని చక్రాలను మాత్రం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందించారు. మొత్తం 170 పరికరాలు ఈ వాచీలో ఉన్నాయి.  మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వాచీలో ఒక క్యూఆర్‌ కోడ్‌నుకూడా నిక్షిప్తం చేశారు.

ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వాచీ విశిష్టతలు తెలియజేయడంతోపాటు 3డీ వర్చువల్‌ వరల్డ్‌లోకి అనుసంధానమయ్యే ఏర్పాటు ఉంది. ఇంతటి సంక్లిష్టమైన వాచీ తయారీకి బుల్‌గారీ కంపెనీకి మూడేళ్ల సమయం పట్టిందట. ఇంతకీ దీని ధర ఎంత అంటారా? కేవలం రూ. 3.35 కోట్లు మాత్రమే! అది కూడా ఆక్టో ఎడిషన్‌ కింద కేవలం 10 వాచీలనే రూపొందించింది. అన్నట్టు.. ఈ సంస్థకు వివిధ తరహా వాచీలకు సంబంధించి ‘అత్యంత పలచని’విభాగంలో ఇది ఎనిమిదో ప్రపంచ రికార్డు అట!     – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌   

మరిన్ని వార్తలు