లోయలో పడ్డ బస్సు.. 14 మంది దుర్మరణం

20 Mar, 2021 14:54 IST|Sakshi

కొలంబో: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. దీంతో 13 మంది దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ విషాద సంఘటన శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలోని పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్‌ గ్రామంలో విషాదం అలుముకుంది.

70 మంది ప్రయాణికులతో శనివారం బస్సు బయల్దేరింది. అయితే కొండ ప్రాంతమైన మొనెరగులా-బదుల్లా రోడ్డు మార్గం చాలా ప్రమాదకరం. ఈ ఇరుకు మార్గంలో ఒకేసారి బస్సు, ట్రక్కు వచ్చాయి. ఈ సమయంలో ట్రక్కును తప్పించబోయి మలుపు ప్రాంతంలో బస్సు కొంచెం పక్కకు జరగడంతో పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 13మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందించిన వెంటనే అధికారులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని పోలీస్‌ అధికారి అజిత్‌ రోహన తెలిపారు. ఈ రోడ్డు వెంట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. 16 ఏళ్లల్లో ఇదే అతి పెద్ద ప్రమాదమని అధికారులు గుర్తించారు. 
 

మరిన్ని వార్తలు