‘మిమ్మల్ని చీరలో చూస్తే.. నాకు కన్నీళ్లు ఆగవు’

19 Jan, 2021 09:59 IST|Sakshi

ప్రమాణస్వీకారం రోజున కమలా హారిస్‌ ఏం ధరించనున్నారు?

వాషింగ్టన్‌:కమలా హారిస్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతుంది. అవును మరి అగ్రరాజ్యం అమెరికాకు తొలిసారి ఓ మహిళ.. అది కూడా ఆసియా ఖండానికి చెందిన నల్ల జాతి మహిళ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. దాంతో ఆమె విజయ ప్రస్థానం గురించి చర్చించుకుంటున్నారు జనాలు. మరో 24 గంటల్లో ఈ భారత సంతతి మహిళ అగ్రరాజ్యం అమెరికాకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ డిబెట్‌ నడుస్తోంది. ప్రమాణస్వీకారోత్సవానికి కమలా హారిస్‌ తన భారతీయ మూలాలను ప్రతిబింబించేలా చీర కట్టుకుంటారా.. లేక సూట్‌ ధరిస్తారా అనే చర్చించుకుంటున్నారు నెటిజనులు. ఎక్కువ మంది కమలా హారిస్‌ చీర ధరిస్తే.. చాలా బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. (చదవండి: కమలా హ్యారిస్‌ ముగ్గురమ్మల కూతురు)

2019నాటి కమలా హారిస్‌ వీడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతుండటంతో ప్రమాణ స్వీకారం రోజున ఆమె ఏం ధరించబోతున్నారనే చర్చ మొదలయ్యింది. 2019 లో కమలా హారిస్‌ వన్ ఏపీఐఏ నెవాడా అనే ఆసియా అమెరికన్ గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేక్షకురాలు ‘‘ఒకవేళ మీరు గనక అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ప్రమాణ స్వీకారం నాడు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిచే దుస్తులు ధరిస్తారా’’ అని​ ప్రశ్నించింది. ఇందుకు సమాధానంగా హారిస్‌.. ‘ముందైతే విజయం సాధించనివ్వండి’ అన్నారు. ఆనాటి మాటలు నేడు నిజం అయ్యాయి. మరో 24 గంటల్లో కమలా హారిస్‌ అమెరికా చరిత్రలో తొలి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయనున్నారు. దాంతో సోషల్‌ మీడియాలో ప్రమాణ స్వీకారోత్సం రోజున ఆమె ఏం ధరించబోతున్నారనే చర్చ తెగ నడుస్తోంది. (చదవండి: అమెరికాలోనే కాదు ఆరు దేశాల్లో మనవాళ్లే!)

కొందరు ఓ అడుగు ముందుకు వేసి హారిస్‌ ఏం ధరిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ బిభుమోహపాత్ర ‘‘మీకు డ్రెస్‌ డిజైన్‌ చేసే అవకాశం లభిస్తే.. గౌరవంగా భావిస్తాను’’ అనగా.. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి ‘‘బనారస్‌ పట్టు చీర ధరించి భారతీయతను గౌరవించండి’’ అని కోరారు. మరో వ్యక్తి ‘‘ప్రమాణ స్వీకారోత్సవం రోజున మిమ్మల్ని చీరలో చూస్తే.. నా కంట్లో నుంచి కారే ఆనందభాష్పాలను ఆపడం ఎవరి తరం కాదు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

>
మరిన్ని వార్తలు