పది నిమిషాల్లోనే వైరస్‌ నిర్ధారణ!

3 Oct, 2020 08:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లాస్‌ఏంజెలిస్‌: కరోనా వైరస్‌ను పది నిమిషాల్లోనే గుర్తించే ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేయడంలో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విజయం సాధించింది. రక్తం లేదా లాలాజలంలోని వైరస్‌ను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు చౌకగా లభించే సెన్సర్లను వినియోగించడం విశేషం. అంతేకాదు... ఈ పరికరాన్ని ఇంట్లో ఎవరికి వారే వాడి వైరస్‌ ఉనికిని తెలుసుకోవచ్చు. గ్రాఫీన్‌ పొర సాయంతో గతంలోనే ఈ శాస్త్రవేత్తలు గౌట్‌ వంటి వ్యాధులను గుర్తించే పద్ధతిని అభివృద్ధి చేశారు. లేజర్‌ కిరణాల సాయంతో ప్లాస్టిక్‌ పొరపై అతి సూక్ష్మమైన కంతలను ఏర్పాటు చేయడం.. వీటిల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ సృష్టించే యాంటీబాడీలను జోడించడం ముఖ్యమైన అంశం. (చదవండి: మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్‌: సీరమ్)‌

ర్యాపిడ్‌ ఫ్లెక్స్‌ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో యాంటీబాడీలతోపాటు కొన్ని ప్రొటీన్లు కూడా ఉంటాయి. తద్వారా వైరస్‌ను గుర్తించడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ స్పందనను, వ్యాధి తీవ్రతను సూచించే మార్కర్లను కూడా గుర్తించవచ్చు. ఇలా ఏకకాలంలో కరోనా వైరస్‌కు సంబంధించిన మూడు అంశాలను తెలుసుకోగలగడం.. చికిత్స విషయంలో చాలా కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వీ గావ్‌ తెలిపారు.  కోవిడ్‌ పరీక్షల ఫలితాల కోసం ప్రస్తుతం కొన్ని గంటల సమయం పడుతున్న విషయం తెలిసిందే. సెన్సర్‌ బాగా పనిచేస్తుందని నమ్మకం కుదిరినప్పటికీ ర్యాపిడ్‌ ఫ్లెక్స్‌ను ప్రస్తుతానికి తాము పరిశోధనశాలలో మాత్రమే పరీక్షించామని చెప్పారు. (చదవండి: ఏడాది చివరికి కొవాక్జిన్‌)

>
మరిన్ని వార్తలు