8 ఏళ్ల చిన్నారి లేఖకి బదులిచ్చిన ప్రధాని

26 Nov, 2020 16:34 IST|Sakshi

లండన్‌: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఇప్పటికీ మనం దాని కంట్రోల్‌లోనే ఉన్నాం. మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక కోవిడ్‌ వ్యాప్తితో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పండుగలు, వేడకలకు దూరంగా ఉన్నాయి. ఒకవేళ నిర్వహించాల్సి వచ్చినా ఎన్నో జాగ్రత్తల నడుమ అతి కొద్ది మందితో మాత్రమే జరుపుకుంటున్నారు. ఇక ఈ ఏడాదిలో మిగిలిన చివరి వేడుక, పండుగ క్రిస్టమస్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ శాంటాక్లాజ్‌.. మనదగ్గర అయితే క్రిస్మస్‌ తాత.  క్రిస్మస్ పండుగ అనగానే చిన్నారులకు కేకులు, క్రిస్మస్ ట్రీ, స్టార్లతోపాటు శాంటాక్లాజ్ తాత కూడా గుర్తుకు వస్తాడు. 

ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించిన శాంటాక్లాజ్‌ తమకు బోలెడన్ని గిఫ్టులను తీసుకువస్తాడని పిల్లలు ఎదురు చూస్తుంటారు. రాత్రి పూట ఇంటి గుమ్మం ఎదుట సంచుల్లో ఆయన గిఫ్ట్‌లను ఉంచి వెళ్లిపోతాడని కథలు చెబుతారు. ఇక చిన్నారులు శాంటాక్లాజ్‌ ఇచ్చే బహుమతుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది వేడుకలకు కుటుంబ సభ్యులందరు కలవడమే వీలు కావడం లేదు.. ఇక శాంటాక్లాజ్‌ వస్తాడా రాడా. ఈ సందేహం ఇప్పటికే ఎందరో చిన్నారుల బుర్రలని తొలిచేస్తుంది. దీని గురించి పిల్లలంతా తల్లిదండ్రులను ప్రశ్నలు అడుగుతూ సతాయిస్తూ ఉండగా.. ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం దీని గురించి ఏకంగా ప్రధానికే ఉత్తరం రాశాడు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఎంటంటే ప్రధాని ఆ చిన్నారికి సమాధానమిస్తూ.. మరో ఉత్తరం రాశాడు. (చదవండి: ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక)

ఆ వివరాలు.. ఎనిమిదేళ్ల మోంటీ అనే చిన్నారి బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కి శాంటాక్లాజ్‌ రాక గురించి సమాధానం ఇవ్వాల్సిందిగా ఉత్తరం రాశాడు. ‘ఈ ఏడాది శాంటాక్లాజ్‌ వస్తాడా.. మాకు బహుమతులు ఇస్తాడా లేదా ప్లీజ్‌ దీని గురించి నాలానే ఇంకా చాలా మందికి అనుమానం ఉంది. శాంటాక్లాజ్‌ రావడం గురించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా దయచేసి క్లారిటీ ఇవ్వండి’ అంటూ మోంటో.. ప్రధానికి తన చిట్టి చిట్టి చేతులతో ఉత్తరం రాశాడు. ఈ లేఖ బోరిస్‌ని కదిలించింది. వెంటనే రిప్లై ఇచ్చారు. క్రిస్మస్‌ నాడు శాంటా తప్పక వస్తారు అంటూ భరోసా ఇచ్చారు. మోంటో ఉత్తరంతో పాటు తాను ఇచ్చిన రిప్లైని ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు బోరిస్‌. ‘ఇప్పటికే నాకు ఇలాంటి లెటర్లు చాలా వచ్చాయి. దీని గురించి నిపుణులతో మాట్లాడాను. ఇక శాంటాక్లాజ్‌ తన సంచిని బహుమలతలో నింపుకుని ప్రయాణం అయ్యారు. క్రిస్టమస్‌ నాడు ఇక్కడికి తప్పక వస్తాడు. అంతేకాక ఇప్పటికే నేను ఉత్తర ధ్రువానికి కాల్‌ చేసి శాంటాక్లాజ్‌ని రావాల్సిందిగా ఆహ్వానించాను. ఆయన తప్పక వస్తారు’ అంటూ ట్వీట్‌ చేశారు బోరిస్‌. ప్రస్తుతం ఈ సంభాషణ తెగ వైరలవుతోంది. ఇక పండుగ సమయంలో ప్రజలు తగిన కోవిడ్‌ నియమాలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేడుకలు సంతోషంగా ముగుస్తాయన్నారు. (ప్రధాని పెద్ద మనసు: బిడ్డకు వైద్యుడి పేరు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా