ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడంలో కీలకంగా అయిదు దేశాల కూటమి
యుద్ధాలు, ఉగ్రవాదంపై పోరులో సమాచారం మార్పిడి..
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆయా దేశాధినేతలతో ట్రూడో
లోతుగా దర్యాప్తు జరగాలంటున్న ఫైవ్ ఐస్ కూటమి
ఖలిస్తాన్ అంశం భారత్, కెనడా మధ్య అగ్గి రాజేస్తోంది. ఖలిస్తాన్ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ అంశంలో ట్రూడో ఇతర దేశాల మద్దతు కూడగట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఫైవ్ ఐస్ (అయిదు కళ్లు) కూటమి తనకు అండగా
ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. మన దేశంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆయా దేశాల అధినేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇంతకీ ఈ ఫైవ్ ఐస్ కూటమి అంటే ఏమిటి ? కెనడా, భారత్ వివాదంలో ఎందుకు కీలకంగా మారింది ?
► ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడానికి అయిదు దేశాలతో ఏర్పాటైన కూటమిని ఫైవ్ ఐస్ (అయిదు కళ్లు) అని పిలుస్తారు. అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఈ కూటమిలో యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ అయిదు దేశాలకు చెందిన నిఘా సంస్థలు అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం ఒకరికొకరు సహకారం అందించుకుంటాయి. భద్రతా పరంగా నిఘా సంస్థలకు అందే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి. ప్రపంచ చరిత్రలో ఈ ఫైవ్ ఐస్ కూటమి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారాన్ని బదిలీ చేసుకుంటుందని పేరు పొందింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు చేసిన ట్రూడో ఈ కూటమిలో మిగిలిన నాలుగు దేశాల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సమాచార మార్పిడి ఇలా..!
► మానవ మేధ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్, భౌగోళిక, ఉపగ్రహ ఆధారిత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఒకరికొకరు పంచుకుంటాయి. రాడార్లు, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్కింగ్ ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా పంచుకుంటూ భద్రతాపరంగా హెచ్చరికలు పంపుకుంటూ ఉంటాయి.
ఏ సమయంలో సహకరించుకున్నాయి?
► వియత్నాం యుద్ధం, ఫాక్‌ల్యాండ్స్ యుద్ధం, గల్ఫ్ వార్, ఇరాన్ ప్రధాని మహమ్మద్ మొసాదిని పదవీచ్యుతుడిని చేయడం, చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అలెండెను గద్దె దింపడం, ఉగ్రవాదంపై పోరాటం సమయంలో ఈ దేశాలు మూడో కంటికి తెలీకుండా సమాచారాన్ని అందించుకున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం నాటి కూటమి..
► ఈ కూటమి ఏర్పాటు ఇప్పటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, యూకే తొలుత చేతులు కలిపి నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి 1946లో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీనినే బ్రూసా ఒప్పందం అని పిలుస్తారు. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడైతే తారాస్థాయికి చేరుకుందో ఆ సమయంలో ఈ కూటమిలో ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా వచ్చి చేరాయి. నార్వే, డెన్మార్క్, పశ్చిమ జర్మనీలు తాత్కాలికంగా చేరినప్పటికీ , 1955 నాటికి మళ్లీ ఈ అయిదు దేశాలే సభ్యులుగా మిగిలాయి. 1990 వరకు ఈ కూటమి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు. న్యూజిలాండ్‌కు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు నిక్కీ హేగర్, అమెరికన్ జర్నలిస్టు జేమ్స్ బామ్‌ఫార్డ్, బ్రిటిష్ జర్నలిస్టు డంకెన్ క్యాంప్‌బెల్ పరిశోధనాత్మక కథనాలతో ఈ కూటమి గురించి అందరికీ తెలిసింది. 2013లో అమెరికాకు చెందిన జాతీయ భద్రతా సంస్థ సభ్యుడైన ఎడ్వర్ స్నోడెన్ ఈ కూటమి కార్యకలాపాలకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేయడంతో ఫైవ్ ఐస్‌పై చర్చ జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకి ఆ అయిదు కళ్ల కూటమితో ట్రూడో సంప్రదింపులు జరుపుతూ ఉండడం తిరిగి తెరపైకి వచి్చంది.
ఇప్పుడేం జరుగుతోంది?
మన దేశంలో జరిగిన జీ–20 సదస్సు కంటే ముందే ట్రూడో అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాధినేతలతో చర్చలు జరిపి నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని భారత్ దగ్గర ప్రస్తావించాలంటూ ఆయా దేశాల అధినేతలతో సంప్రదింపులు జరిపినట్టు వివిధ అంతర్జాతీయ పత్రికలు కథనాలు వెల్లడించాయి.
నిజ్జర్ హత్యపై దర్యాప్తుకి భారత్ సహకరించేలా ఒత్తిడి పెంచాలని ట్రూడో స్వయంగా బైడెన్, రిషి సునాక్ వంటి వారిని కోరారు. అయితే ఈ హత్యను బహిరంగంగా ఖండించడానికి నిరాకరించిన ఆయా దేశాలు దర్యాప్తు మరింతగా లోతుగా జరగాలని మాత్రమే అంటున్నాయి. ఈ దర్యాప్తుకి భారత్ సహకరించాలని అమెరికా అంటే, బ్రిటన్ కూడా అదే మాట మీదుంది. అయితే భారత్‌తో తమకున్న వాణిజ్య అంశాలపై దీని ప్రభావం ఉండబోదని బ్రిటన్ స్పష్టం చేసింది.
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై తమ దగ్గర ఆధారాలున్నాయని ట్రూడో చెబుతూ ఉంటే, మరింత లోతుగా విచారణ చేయాలని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సూచిస్తున్నాయి. వాస్తవాలు బయటపడేవరకు తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని న్యూజిలాండ్ తెగేసి చెప్పేసింది. దీంతో ట్రూడో భారత్‌ను రెచ్చగొట్టేలా దౌత్యపరమైన చర్యలకు దిగుతూ రాయబారుల్ని దేశం నుంచి వీడి వెళ్లా లని ఆదేశించారు. భారత్ మరో అడుగు ముందుకు వేసి కెనడా పౌరుల వీసాలను కూడా నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రూడో నాయకత్వ పటిమపై వ్యతిరేకత ఎదురు కావడం ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకున్న పాపులారిటీ 31శాతానికి పడిపోయిందని తాజా సర్వేలో వెల్లడైంది.
– సాక్షి, నేషనల్ డెస్క్