ట్రక్కు డ్రైవర్ల దిగ్భంధన నిరసనలు: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కెనడా ప్రధాని

10 Feb, 2022 09:47 IST|Sakshi

కరోనా కట్టడికి వ్యాక్సిన్​ ఒక్కటే మార్గమని.. దేశాలన్నీ వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను ఉధృతం చేస్తున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్​ తప్పనిసరి ఆదేశాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు వ్యాక్సినేషన్​ తప్పనిసరి చేయడంతో వ్యతిరేక ఉద్యమం మొదలైంది. కానీ, ఈ ఉద్యమాన్ని ‘‘ఆమోదయోగ్యం కాదు” అని అంటున్నాడు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో.

కెనడాలో ట్రక్కర్ల నిరసన చెయ్యి దాటిపోయింది. ఇంతకాలం దేశం మధ్యలో కొనసాగిన నిరసనలు.. ఇప్పుడు సరిహద్దుల దాకా చేరుకున్నాయి. సెంట్రల్ ఒట్టావాతో పాటు సరిహద్దులను సైతం మూసేస్తున్నారు నిరసనకారులు. పరిస్థితులు చేజారిన తరుణంలో.. ప్రధాని ట్రూడో సీరియస్​ అవుతున్నారు.  ముఖ్యంగా ట్రక్కర్లు నిరసనకు సంఘీభావంగా విండ్సర్, యుఎస్ నగరం డెట్రాయిట్ మధ్య అంబాసిడర్ బ్రిడ్జ్ దిగ్బంధనంలో ఎక్కువ మంది వ్యక్తులు చేరడంతో.. ఈ చేష్టలు కెనడా ఆర్థిక పునరుద్ధరణకు ముప్పు కలిగిస్తుందని ట్రూడో హెచ్చరిస్తున్నారు.

‘‘దిగ్బంధనాలు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలు ఆమోదయోగ్యం కాదు. వ్యాపారాలు, తయారీదారులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి” అని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని ట్రూడో ప్రసంగించారు. దిగ్బంధనాలతో మహమ్మారిని అంతం చేయలేం.. సైన్స్‌తోనే అంతం చేయడం వీలవుతుంది. ప్రజారోగ్య చర్యలతో దీనిని ముగించాలి అని ట్రక్కర్లను ఉద్దేశించి ప్రసంగించారాయన. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి ఏం చేయాలో అది ప్రతీదీ చేసుకుంటూ పోతాం అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన.

కెనడియన్ రాజధాని ఒట్టావాలో రెండు వారాల పాటు సాగిన ట్రక్కర్లు నిరసనకు సంఘీభావంగా విండ్సర్ డెట్రాయిట్ మధ్య అంబాసిడర్ బ్రిడ్జ్ దిగ్బంధనం వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ట్రేడ్​ కారిడార్​గా ఉన్న ఈ వంతెన గుండా నిత్యం 40వేల మంది రాకపోకలు చేస్తుంటారు. దాదాపు 323 మిలియన్​ డాలర్ల విలువైన సరుకుల రవాణా సాగుతుంటుంది. కోవిడ్ ఆరోగ్య నిబంధనలపై కోపంతో సరిహద్దు వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తే.. ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన కెనడా, మరింత దిగజారిపోక తప్పదని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. 

అంతకుముందు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ.. వంతెన దిగ్బంధనంపై కెనడియన్ సరిహద్దు ఏజెన్సీలతో యుఎస్ అధికారులు టచ్​లో ఉన్నారని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు