కెనడా సంచలనం: సిగరెట్‌ ప్యాక్‌ మీదే కాదు.. ప్రతి సిగరెట్‌ పైనా హెచ్చరిక

13 Jun, 2022 15:49 IST|Sakshi

సిగరెట్‌ బాక్సుల మీద ఆరోగ్యానికి హానికరం హెచ్చరికలు ఫొటోలతో సహా ఉండేవి. కానీ, ఆ సందేశాలు ప్రజల్లో అంతగా చైతన్యం తీసుకురాలేకపోయాయి. పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్‌ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం.

ఇంతవరకు పొగాకు లేదా సిగరెట్‌ ఉత్పత్తుల పై గ్రాఫిక్‌ ఫోటోతో కూడిన వార్నింగ్‌ సందేశాలు ఉండేవి. సిగరెట్‌ కంపెనీలు వాటిని అనుసరిస్తూ.. ఒక కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశాయి. అయితే పోను పోను ప్రజల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కెనడా దేశం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంతవరకు ప్యాకెట్లపైనే హెచ్చరికలు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రతి సిగరెట్ట్‌ పైన ఈ సందేశం ఉంటే...గుప్పు గుప్పు మని పీల్చే ప్రతి సిగరెట్‌ ఎంత విషమో అర్థమవుతుందని అంటోంది కెనడా ఆరోగ్య మంత్రిత్వశాఖ.

ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు  కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాలు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నాటికల్లా ఈ ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోందన్నారు.

ఈ మేరకు కెనడియన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ...ప్రతి సిగరెట్‌లపై ముంద్రించే హెచ్చరిక ప్రతి వ్యక్తికి చేరువయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతవరకు మరే ఏ ఇతర దేశం దేశం ఇలాంటి నిబంధనలను అమలు చేయలేదు. ఇది విస్మరించలేని హెచ్చరిక అని అన్నారు. ఈ సరికొత్త విధానాన్ని ఇంటర్నేషనల్ టుబాకో కంట్రోల్ పాలసీ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్‌ ఇన్వెస్టిగేటర్ జియోఫ్రీ ఫాంగ్ ప్రశంసించారు. తాజా గణాంకాల ప్రకారం కెనడాలో 10 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 2035 కల్లా ఆ సంఖ్యను తగ్గించేందుకే కెనడా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.

(చదవండి: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2)

మరిన్ని వార్తలు