ఛాతిపై వెంట్రుకలు.. చావాలనుకుంది..చివరకు.. 

17 Feb, 2021 19:34 IST|Sakshi
ఈస్టర్‌ కాలిక్ట్సే బియా

కెనడా : మన ఆలోచనలు మనల్ని బాధ పెట్టినంతగా వేరేవీ బాధపెట్టలేవు. జుట్టు తెల్లబడుతోందని, బట్టతల వచ్చిందని, బరువు పెరుగుతున్నామని ఇలా ప్రతి విషయానికి ప్రతిరోజూ బాధపడిపోయేవారు లెక్కలేనంతమంది. అశాశ్వతమైన సమస్యలకు శాశ్వతమైన పరిష్కారాలు ఉండొచ్చు..లేకపోవచ్చు. అయినంత మాత్రాన జీవితమేమీ ఆగిపోదు. పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతూ.. సంతోషంగా బతికేవాళ్లు ఈ ప్రపంచంలో లేకపోలేదు. అంతా వాస్తవాన్ని గ్రహించటంలోనే ఉంది. అమెరికాకు చెందిన 24 ఏళ్ల ఓ అమ్మాయి కూడా తన సమస్యతో కొన్నేళ్లపాటు ఇబ్బందిపడింది. చావాలనుకుంది. చివరకు వాస్తవాన్ని గ్రహించి తన సమస్యతో ఓ కొత్త ట్రెండ్‌కు తెరతీసింది.

వివరాల్లోకి వెళితే.. కెనడా, మాన్‌ట్రియల్‌కు చెందిన ఈస్టర్‌ కాలిక్ట్సే బియా అనే యువతికి 19 ఏళ్లు ఉన్నప్పటినుంచి ఛాతిపై వెంట్రుకలు మొలవటం ప్రారంభమైంది. దీంతో ఆ వెంట్రుకలను తొలగించుకోవటానికి చాలా ఇబ్బందిపడేది. ఎంతో నొప్పిని భరించేది. అయితే 2019లో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. వెంట్రుకలను తీసేసుకునే పనికి స్వప్తి పలికింది. వెంట్రుకలతో ఉన్న తనను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టింది. దీనిపై బియా మాట్లాడుతూ.. ‘‘ నా ఛాతిపై మొలిచిన వెంట్రుకలను తీసేసుకోవటానికి చాలా ఇబ్బందులు పడేదాన్ని. చాలా నొప్పిని భరించేదాన్ని. వెంట్రుకల కారణంగా నా మీద నాకే అసహ్యం వేసింది. సిగ్గుపడేదాన్ని. చివరకు డిప్రెషన్‌కు గురై చనిపోదామనుకున్నాను. నాలో ఆలోచనలు మొదలయ్యాయి. వాస్తవాలను గ్రహించాను. తర్వాత వెంట్రుకలను తొలగించుకునే పనికి గుడ్‌బై చెప్పాను. ( కొత్త టిక్‌టాక్‌ ఛాలెంజ్‌: తోలు పీకేసుకుంటున్నారు! )

నా జీవితంలో నేను చేసిన ఓ గొప్ప పని ఛాతిపై ఉన్న వెంట్రుకలను తీసేయకుండా ఉండటం. నా చర్మంతో నేనిప్పుడు చాలా సెక్సీగా, కంఫర్ట్‌బుల్‌గా అనిపిస్తున్నాను. మా నాన్న బంధువుల్లోని మహిళలకు ఇలా ఛాతిపై వెంట్రుకలు ఉండటం సహజమని తెలిసింది. నేను బయటకు వెళ్లినపుడు ప్రజలు నన్ను వింతగా చూసేవారు. కొంతమంది వీడియోలు కూడా తీసేవారు. వింతగా అనిపించేది’’ అని పేర్కొంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బియా ఫొటోలు వైరల్‌గా మారాయి. 90 శాతం మంది ఆమెపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

మరిన్ని వార్తలు