ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని

22 Jan, 2022 16:11 IST|Sakshi

కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతంలోని తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. ఈ సంఘటన మనసుని కదిలించే" విషాదంగా  కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూడో శుక్రవారం మాట్లాడుతూ... "అమెరికా సరిహద్దుల గుండా ప్రజల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం. మానవ అక్రమ రవాణాదారుల బాధితులు...మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే  కోరిక నెరవేరకుండానే ఆ కుటుంబం అలా చనిపోవడం చాలా విషాదకరం. ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిచేసేలా తాము చేయగలిగినదంతా చేస్తున్నాం." అని అన్నారు.

పైగా కెనడా స్మగ్లింగ్‌ను ఆపడానికి , ప్రజలకు సహాయం చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌తో కలిసిపనిచేస్తోందని ట్రుడో చెప్పారు. అక్రమ వలసదారులు సాధారణంగా అమెరికా నుండి కెనడాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని కెనడియన్‌ అధికారులు వెల్లడించారు.  అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత నుంచే కెనడాలోకి కాలినడకన సరిహద్దు దాటడం పెరిగిందని తెలిపారు. ఈ మేరకు గురువారం మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్‌సీఎంపీ) నలుగురి మృతదేహాలను దక్షిణ మధ్య మానిటోబాలోని ఎమర్సన్ ప్రాంతానికి సమీపంలో యుఎస్ కెనడా సరిహద్దులోని కెనడియన్ వైపు కనుగొన్నాం అని చెప్పారు.

అయితే మృతులంతా గుజరాత్‌కి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు అని, తీవ్రమైన చలికి గురికావడం వల్లే మరణించారని తెలిపారు. ఈ మేరకు ఆర్‌సీఎంపీ నాలుగు మృతదేహాలను కనుగొన్న వెంటనే అసిస్టెంట్ కమిషనర్ జేన్ మాక్‌లాచీ దీనిని హృదయ విదారక విషాదంగా పేర్కొన్నారు. పైగా మంచుతుఫానులో ఈ కుటుంబం చిక్కుకున్నట్లు తాము గుర్తించాం అని చెప్పారు. ఈ మేరకు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా మరణించిన వారి జాతీయతను ధృవీకరించడమే కాక, ఈ సంఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు. అంతేకాదు బిసారియా మాట్లాడుతూ...ఇది ఘోరమైన విషాదం. సమన్వయ సహాయం కోసం భారత కాన్సులర్ బృందం మానిటోబాకు వెళ్లనుంది. ఈ ఆందోళనకరమైన సంఘటనలను పరిశోధించడానికి మేము కెనడియన్ అధికారులతో కలిసి పని చేస్తాము" అని బిసారియా ట్వీట్ చేశారు. 

(చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్‌ తర్వాత ప్రయాణికులకు ఝలక్‌ ఇచ్చిన పైలెట్‌..)

మరిన్ని వార్తలు