మెడలో 16 కిలోల బరువు.. రెండేళ్లుగా ‘దుప్పి’ తిప్పలు.. నాలుగుసార్లు మిస్‌

12 Oct, 2021 20:22 IST|Sakshi

కొలరాడో: మెడలో టైర్‌తో పరుగెడుతున్న ఈ దుప్పిని పట్టుకోవడానికి కొలరాడో వన్యప్రాణి సంరక్షణ అధికారులకు చుక్కలు కనబడ్డాయి. కొండల ప్రాంతంలో తిరిగే ఆ దుప్పి మెడలోకి టైర్‌ ఎలా వచ్చిందో తెలియదు గానీ రెండేళ్లుగా అధికారులు దాని కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి దుప్పిని గత శనివారం పట్టుకుని టైర్‌ని తొలగించారు. 

నాలుగున్నర ఏళ్ల వయసు.. 270 కిలోల బరువున్న ఆ దుప్పి గత వారం రోజుల్లో నాలుగుసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిందని పార్క్‌ అధికారి స్కాట్‌ ముర్దోచ్‌ తెలిపారు. తొలుత దుప్పిని పట్టుకుని టైర్‌ని కట్‌ చేద్దామని అనుకున్నప్పటికీ సాధ్య పడలేదని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో ఐదోసారి దుప్పిని టైర్‌ మోత నుంచి రక్షించామని అన్నారు. 
(చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!)

మట్టి, రాళ్లతో నిండిన ఆ టైర్‌ బరువు సుమారు 16 కిలోల వరకు ఉంటుందని, దాని వల్ల దుప్పి ఆరోగ్యంపై ప్రభావం పడేదని వెల్లడించారు. అయితే, రెండేళ్లుగా అంత బరువు మోసినా దుప్పి మెడ ఎప్పటిలా మామూలుగా ఉండటం మంచి విషయమని పేర్కొన్నారు. మెడపై చిన్న గాయం మాత్రం ఉందని తెలిపారు. 

(చదవండి: వైరల్‌: అరటి గెల మీద పడటంతో కోర్టుకు.. ఐదేళ్లు పోరాడి విజయం.. రూ.4 కోట్ల నష్ట పరిహారం)

మరిన్ని వార్తలు