మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..

20 Feb, 2023 11:47 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండగా.. ఇప్పుడు పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దీంతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఏర్పడింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు దిగుమతి చేసుకోలేక పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పాకిస్తాన్‌లో కర్యకలాపాలు నిలివేశాయి. సుజుకీ మోటార్ కార్పోరేషన్ మరికొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. 

టైర్లు, ట్యూబ్‌లు తయారు చేసే ఘంధారా టైర్, రబ్బర్ కంపెనీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు చెప్పింది. ముడిసరుకు దిగమతికి ఇబ్బందులు, వాణిజ్య బ్యాంకుల నుంచి కన్‌సైట్‌మెంట్ క్లియరెన్స్‌ పొందడానికి అడ్డంకులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కేవలం ఉదాహరణలే. ఫర్టిలైజర్స్, స్టీల్, టెక్స్ట్‌టైల్స్ రంగాలకు చెందిన అనేక పరిశ్రమలు పాకిస్థాన్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

పాకిస్తాన్‌ విదేశీ కరెన్సీ నిల్వలు 3.19 బిలియన్ డాలర్లే ఉండటంతో దిగుమతులకు నిధులు సమకూర్చలేకపోతుంది. నౌకాశ్రయాల్లో వేలాది కంటైనర్ల సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమల ఉత్పత్తి ఆగిపోయింది. వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం పెరిగి ఆర్థిక వృద్ధిపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో పరిశ్రమలు మూతపడటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.

సుజుకీతో పాటు హోండా మోటార్, టొయోటా మోటార్ కూడా కొద్దివారాల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో పాకిస్తాన్‌లో కార్ల సేల్స్ జనవరిలో 65శాతం పడిపోయాయి. ఆర్థిక సంక్షోభం వల్ల డిమాండ్ భారీగా తగ్గడమూ దీనికి మరో కారణం.
చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి..

మరిన్ని వార్తలు