ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే!

30 Nov, 2022 10:52 IST|Sakshi

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఇరాన్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. సాధారణంగా తమ జట్టు మ్యాచ్‌ ఓడిపోతే ఆ దేశస్థులు నిరాశ చెందుతారు. కానీ అందుకు భిన్నంగా సొంత జట్టు ఓటమిపాలవ్వడంతో ఇరాన్‌లో వేడుకలు జరుపుకుంటున్నారు. వందలాది సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్‌లో ఉత్సాహంతో డ్యాన్‌లు కూడా చేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇరాన్‌లో ఈ వేడుకలకు కారణం దేశ వ్యాప్తంగా గతకొంత కాలంగా జరుతున్న ఆందోళనలే. హిజాబ్ ధరించమంటూ అక్కడి మహిళలు కదం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అటు ఇరాన్‌ ప్రభుత్వం సైతం నిరసనకారులను తీవ్రంగా అణచివేస్తోంది. ఇలాంటి గంగరగోళ పరిస్థితుల్లో తమ దేశ ఫుట్‌బాల్‌ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనడాన్ని ఖండిస్తున్నారు. ఆందోళనతో ఓవైపు జనం చనిపోతుంటే ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లడం అవసరమా అని జనం అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంతోనే ఇన్ని రోజులు రోడ్లపై ఆందోళనలు చేసిన ప్రజలు.. ఇప్పుడు ఆనందంతో వీధుల్లో చిందులేస్తున్నారు. 

ఇదిలా ఉండగా అమెరికాతో మ్యాచ్‌ ముందు తమ ఆటగాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే వారి కుటుంబ సభ్యలుపై చర్యలు తీసుకొంటామని ఇరాన్‌ బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ప్రముఖ మీడియా కథనాలు ప్రచురించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సమయంలో ఇరాన్‌ ఆటగాళ్లలో కొందరు జాతీయ గీతం పాడేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇరాన్‌లో హిజాబ్ మంటలు రగులుతూనే ఉన్నాయి. వేలాదిగా యువత, మహిళలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఆందోళనకారులను అణచివేసేందుకు ఇరాన్‌ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారురు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్‌ చేస్తున్నారు. ఆందోళనల కారణంగా సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు.

సెప్టెంబర్‌ నెలలో హిజాబ్‌ సరిగ్గా ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మృతి చెందింది. అప్పటి నుంచి ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. తాము హిజాబ్‌ను ధరించమని చెబుతూ.. కొందరు జుట్టు కత్తిరించుకోగా.. మరికొందరు హిజాబ్‌ను తగలబెట్టారు. అలా మొదలైన నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతూనే ఉన్నాయి.
చదవండి: 24 మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన లంక

మరిన్ని వార్తలు