ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!

21 Dec, 2021 15:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: ఒక్కొసారి జీవితంలో మనం ఊహించుకునే దానికి, జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలు.. పూర్తిగా తలకిందులుగా మారుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను కొందరు ధైర్యంగా ఎదుర్కొంటే.. మరికొందరు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి.

ఈ సమయాల్లో వీరు .. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ మిత్రులకు గానీ, దగ్గరి వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెబుతుంటారు. ఈ సమయంలో అవతలివారు.. అప్రమత్తంగా వ్యవహరిస్తే.. బాధితుల ప్రాణాలు నిలుస్తాయి. తాజాగా, ఒక డెలీవరీ బాయ్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ఒక నిండు ప్రాణం నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వివరాలు.. చైనాలోని హెనాన్‌ ప్రావీన్స్‌లో ఒక కస్టమర్‌ వ్యాపారంలో నష్టపోయాడు. ఈ క్రమంలో తాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే, తనకు ఇష్టమైన ఆహరం తిని చనిపోవాలనుకున్నాడో.. ఏమో గానీ.. ఫుడ్‌ కోసం ఆర్డర్‌ పెట్టాడు. ఈ క్రమంలో.. డెలీవరీబాయ్‌ డెలీవరీని ఇ‍వ్వడానికి కస్టమర్‌ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ‘ది లాస్ట్‌ మీల్‌ ఇన్‌  మై లైఫ్‌ ’ ఇది నా జీవితంలో చివరి భోజనం.. అంటూ నోట్‌ రాసిపెట్టి ఉంది.

దీన్ని చూసిన డెలీవరీబాయ్‌ షాక్‌కు గురయ్యాడు. కస్టమర్‌ ఇంటి తలుపు తట్టడానికి ప్రయత్నించాడు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్‌ను.. తలుపును తీయాలని కోరారు. అయితే, బలవంతంగా లోపలికి వస్తే.. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.

ఈ క్రమంలో పోలీసులు బాధితుడిని ఓదార్చి.. మాటల్లో పెట్టారు. ఆ తర్వాత.. బాధితుడు చెప్పిన విషయాన్ని ఓపికతో విన్నారు. కాగా, కస్టమర్‌.. తాను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు.  ఆ తర్వాత పోలీసులు చాకచక్యంగా గదిలోపలికి ప్రవేశించారు. కస్టమర్‌ అప్పటికే బాధతో 60 నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు.

వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడంతో బాధితుడి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం .. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. డెలీవరీ బాయ్‌ను అభినందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు