ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా

25 Jul, 2020 04:58 IST|Sakshi

చెంగ్డూ సిటీలోని  మీ కాన్సులేట్‌ను మూసేయండి

అమెరికాను ఆదేశించిన చైనా

బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది.  

భద్రతకు భంగం కలిగిస్తున్నారు
హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.  

అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం  
చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్‌ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్‌ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్‌లో అమెరికా కాన్సులేట్‌ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్‌
వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్‌ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు