కరోనా వ్యాక్సిన్‌ను అడ్డుకుంటారా ?!

10 Oct, 2020 16:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారికి సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు ఇప్పుడు ఎలా ప్రచారం అవుతున్నాయో రేపు ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా కూడా తప్పుడు వార్తలు ప్రచారం అవుతాయనడంలో సందేహం లేదు. రేపు ఆ వ్యతిరేక ప్రచారం ఓ ఉద్యమంగా కొనసాగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1885లో స్మాల్‌ పాక్స్‌ (మశూచి, అమ్మవారు, తట్టు)కు వ్యతిరేకంగా కూడా వ్యతిరేక ఉద్యమం లేదా ఆందోళన కొనసాగింది. డాక్టర్‌ అలెగ్జాండర్‌ ఎం రోజ్‌ అనే వైద్యుడు కెనడాలో వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీసి ప్రజలెవరూ వ్యాక్సిన్‌ తీసుకోవద్దంటూ కర పత్రాలను కూడా పంచారు. 

ఆయన ఆ ఉద్యమంలో తనను తాను హీరోగా కూడా అభివర్ణించుకున్నారు. మశూచి సోకిన వారిలో నాడు 30 నుంచి 40 శాతం మంది మరణిస్తుంటే అది అబద్ధమని, మరణాల సంఖ్య పది శాతానికి మించి లేదంటూ అలెగ్జాండర్‌ వాదించారు. వ్యాక్సిన్‌ పేరిట డ్రగ్‌ కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి నాటకం ఆడుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఆయన కెనడాలోని మాంట్రియాల్‌ నగరంలో ఉండి ఉద్యమాన్ని నడిపారు. అదే ఏడాది అక్టోబర్‌లో ఆయన మాంట్రియాల్‌ నుంచి అంటారియోకు రైల్లో వెళ్లారు. అక్కడ క్వారంటైన్‌ ఇన్‌స్పెక్టర్లు డాక్టర్‌ అలెగ్జాండర్‌ను అదుపులోకి తీసుకోగా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అప్పటికే ఆయన భుజంపై మశూచిని నిరోధించే టీకా గుర్తులున్నాయి. 
(చదవండి: కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా..)

ఈ విషయం ప్రింట్‌ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఆయన తన వ్యతిరేక ఉద్యమానికి తెరదించారు. (ప్లేగ్‌ ఏ స్టోరీ ఆఫ్‌ స్మాల్‌ఫాక్స్‌ ఇన్‌ మాంట్రియల్‌ పుస్తకంలో పూర్తి వివరాలు చూడవచ్చు) ఆ తర్వాత కాలంలో వ్యాక్సిన్‌ వల్ల పిల్లలకు ఆటిజం (నరాల బలహీనత వల్ల మెదడు ఎదగకపోవడం) వస్తుందని ఆండ్రీవ్‌ వేక్‌ఫీల్డ్‌ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. వ్యాక్సిన్‌ వ్యతిరేక ఆందోళనతో ఎక్స్‌పర్ట్‌ (నిపుణుడు) అనే పదం వైద్య పరిభాషలోకి వచ్చి చేరిందని చెబుతారు. వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ధారాళంగా మాట్లాడేవారిని ‘ఎక్స్‌పర్ట్‌’ అని పిలిచేవారట. గత కొన్ని దశాబ్దాల వైద్య చరిత్రను పరిశీలించినట్లయితే ప్రతి వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా అంతో ఇంతో ప్రచారం జరిగింది.  సోషల్‌ మీడియా దూసుకుపోతున్న నేటి తరంలో కోవిడ్‌–19 నిరోధక వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరిగే అవకాశం ఉంది. 
(చదవండి: ట్రంప్, బైడన్‌ యాడ్స్‌ ఖర్చు 502 కోట్లు)

మరిన్ని వార్తలు