Sri Lanka: మైనార్టీలో లంక ప్రభుత్వం.. ఎమర్జెన్సీ ఎత్తివేత! మరింత అధ్వాన్నంగా..

6 Apr, 2022 10:39 IST|Sakshi

శ్రీ లంకలో పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక్కో వ్యవస్థ దారుణంగా పతనమైపోతోంది. తాజాగా ఎమర్జెన్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రకటించడంతో పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది. 

స్వాతంత్ర్యం వచ్చాక శ్రీ లంకలో ఈస్థాయి సంక్షోభం తలెత్తడం ఇప్పుడే కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో మొదలై.. ప్రజలను ఆగమాగం చేస్తోంది. ప్రజా నిరసనలతో దేశం అట్టుడికి పోతుండగా.. మరోవైపు మంత్రుల రాజీనామా, మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వంతో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. ఈ తరుణంలో మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించాడు. 

► ప్రభుత్వం నుండి చట్టసభ సభ్యులు వాకౌట్ కావడంతో శ్రీలంక అధ్యక్షుడు ఎమర్జెన్సీ ఆర్డర్‌ను రద్దు చేశారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రేట్లు ఆకాశాన్ని అంటాయి. చివరకు టీవీ ఛానెళ్లను, పత్రికలను సైతం మూసేశారు. శ్రీ లంకలో ఐపీఎల్‌ టెలికాస్టింగ్‌ ఆపేశారు. 

► మందుల కొరతతో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చివరకు ప్రాణాప్రాయ స్థితిలో ఉపయోగించే మందులకు సైతం కొరత ఏర్పడింది. దీంతో మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతీ తెలిసిందే.

► ఇంకోవైపు ప్రభుత్వ కూటమి నుంచి  మంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో 225 మంది సభ్యులున్న సభలో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన 113 మ్యాజిక్‌ ఫిగర్‌కు మహీంద రాజపక్స ప్రభుత్వం దూరమైంది. ప్రభుత్వం మైనార్టీలో పడింది. 

► శ్రీ లంక పరిస్థితులను ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌తో పాటు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం సైతం నిశితంగా పరిశీలిస్తోంది. 

ఘటనపై దర్యాప్తు
శ్రీ లంక పార్లమెంటు దగ్గర పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో ముసుగులు ధరించిన సైనికుల బృందం.. బైక్‌లపై గుంపు గుండా వెళ్లడంపై శ్రీలంక ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా విచారణకు ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసనలో బైక్‌లపై వచ్చిన ఆర్మీ సైనికులకు, పోలీస్‌ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు దృష్టికి రావడంతో ఆర్మీ కమాండర్ శవేంద్ర సిల్వా, ఐజిపిని ఘటనపై విచారణకు అభ్యర్థించినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ ఉంటుందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు