చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్‌

10 Mar, 2022 08:10 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రం యూరప్‌ గుండెల్లో మరోసారి గుబులు పుట్టిస్తోంది. రష్యా కాల్పుల్లో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినడంతో బుధవారం ప్లాంటుకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ జనరేటర్లు బ్యాకప్‌ పవర్‌ అందజేస్తూ నెట్టుకొస్తున్నాయి. కానీ వాటిలో రెండు రోజులకు సరిపడా డీజిల్‌ మాత్రమే అందుబాటులో ఉందని ఉక్రెయిన్‌ చెబుతోంది.

విద్యుత్‌ సరఫరా ఆగిపోయి విద్యుత్కేంద్రంలోని అణు వ్యర్థాల కూలింగ్‌ వ్యవస్థ దెబ్బ తింటే అణు ధార్మిక లీకేజీ తప్పదంటున్నారు. అణు, ధార్మిక భద్రత వ్యవస్థలపై నియంత్రణ చేజారి 1986ను మించిన ప్రమాదానికి దారి తీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో యూరప్‌ అంతా మరోసారి భయం గుప్పిట్లో గడుపుతోంది. చెర్నోబిల్‌ కేంద్రాన్ని రష్యా దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్‌ లైన్ల మరమ్మతు కోసం కాల్పులను తాత్కాలికంగా ఆపాలని రష్యా సైన్యానికి ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం వాడకంలో లేని చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రం నుంచి తమకు డేటా అందడం ఆగిపోయిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. అందులో పని చేస్తున్న సిబ్బంది భద్రత పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. వాళ్లు 13 రోజులుగా నిరంతరాయంగా పని చేస్తున్నారని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెల్‌ గ్రోసీ అన్నారు. అయితే, ‘‘కరెంటు కోతతో ప్లాంటు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ‘‘అణు వ్యర్థ నిల్వల నుంచి వచ్చే వేడిని చల్లార్చేందుకు ప్లాంటులో నిత్యం అందుబాటులో ఉండే కూలింగ్‌ వాటర్‌ చాలు.

అందుకోసం అదనపు కరెంటు సరఫరా అవసరం లేదు’’ అని ఒక ప్రకటనలో ఐఏఈఏ పేర్కొంది. ఉక్రెయిన్‌ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్గోటమ్‌ మాత్రం విద్యుత్కేంద్రంలోని 20 వేల అణు వ్యర్థ యూనిట్లను చల్లబరిచి ఉంచేందుకు నిరంతర కరెంటు సరఫరా తప్పనిసరని అంటోంది. ‘‘లేదంటే అణు ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. గాలి ద్వారా ఉక్రెయిన్‌తో పాటు బెలారస్, రష్యా, యూరప్‌లోని ఇతర దేశాలకూ వ్యాపించి వినాశనానికి దారి తీస్తాయి’’ అని ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చింది. 

1986లో ఏం జరిగింది? 
చెర్నోబిల్‌ అణు విద్యుత్కేంద్రం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1986లో భద్రత పరీక్షల సందర్భంగా ఇందులోని నాలుగో రియాక్టర్‌ పేలి పెద్ద ప్రమాదానికి దారితీసింది. పేలుడులో చనిపోయింది ఇద్దరే అయినా, ఆ తర్వాత అది పెను వినాశనానికే దారి తీసింది. మంటలను ఆర్పిన సిబ్బందిలో 30 మందికి పైగా మూడు నెలల్లోపే మృత్యువాత పడ్డారు.

పేలుడు వల్ల 100 రకాలకు పైగా రేడియో ధార్మిక పదార్థాలు వెలువడ్డాయి. వీటి ప్రభావం యూరప్‌పై ఏళ్ల తరబడి కొనసాగింది. రేడియో ధార్మికత బారిన పడి నానారకాల వ్యాధులతో వేలాది మంది నరకయాతన అనుభవించి మరణించారు. చెర్నోబిల్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిప్యాట్‌ నగరంలోని దాదాపు 50 వేల మందిని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోపే పూర్తిగా ఖాళీ చేయించారు. మొత్తమ్మీద పరిసర ప్రాంతాల నుంచి 20 లక్షల మందిని ఖాళీ చేయించినట్టు అంచనా.   

(చదవండి: ఉక్రెయిన్‌ వీడిన 10 లక్షల మంది చిన్నారులు)

>
మరిన్ని వార్తలు