ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు

13 Jun, 2021 15:55 IST|Sakshi

చికాగో: వారమంతా కష్టపడితే మనకు సెలవు దొరికేది ఒకరోజు. ఆ ఒక్కరోజును ఎలా ప్లాన్‌ చేసుకొని గడపాలా అని ఆలోచిస్తుంటాం. ముఖ్యంగా పనివల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. ఇక ఒత్తిడిని దూరం చేయడానికి కొంతమంది స్విమ్మింగ్‌ను మార్గంగా ఏంచుకుంటారు. అయితే స్విమ్మింగ్‌ చేసేవాళ్లు మహా అయితే నెల రోజులు కంటిన్యూగా చేయగలుగుతారు. అంతకుమించి చేసినా బోర్‌ కొట్టడం ఖాయం. కానీ అమెరికాలోని చికాగొకు చెందిన ఒక బస్‌డ్రైవర్‌ మాత్రం 365 రోజుల నుంచి ప్రతీరోజు లేక్‌ మిచిగాన్‌లో ఈత కొట్టడానికి వస్తూనే ఉన్నాడు. అదేంటి ప్రతీరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే.. నాకున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గం అనిపించింది.. అందుకే సంవత్సరం నుంచి ఇదే పనిలో ఉన్నా అంటూ వింత సమాధానమిచ్చాడు.

వివరాలు.. చికాగోకు చెందిన డాన్‌ ఓ కానర్‌ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు‌. ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం.. ఆఫీస్‌కు వెళితే అధికారులు ఒత్తిడి తేవడం.. దీనికి తోడూ రోజు 12 గంటలకు పైగా బస్‌ నడపడం.. ఇవన్నీ కలిపి అతన్ని మానసికంగా చాలా కుంగదీశాయి. అదే సమయంలో కరోనా మహమ్మారితో అమెరికా మొత్తం లాక్‌డౌన్‌ ఉండడంతో అతనికి పని తగ్గిపోయింది. దీంతో మానసిక ప్రశాంతత కోసం కాస్త భిన్నంగా ఆలోచించాడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున మాంట్రోస్‌ హార్బర్‌లో ఉన్న లేక్‌ మిషిగాన్‌కు చేరుకొని దూకడం ప్రారంభించాడు. అప్పటినుంచి కాలాలు మారుతున్నా తన పని మాత్రం ఆపలేదు. గడ్డకట్టే చలిలోనూ వచ్చి నదిలో దూకడంతో గడ్డకట్టిన నీళ్లతో దాదాపు 20 సార్లు దెబ్బలు తగలడంతో పాటు ఒంటినిండా గాట్లు పడేవి. అంత బాధను ఓర్చుకొని తన పని కానిచ్చి వెళ్లిపోయేవాడు. అలా సరిగ్గా నిన్న(శనివారంతో) ఏడాది పూర్తి కానుండడంతో కానర్‌ సంతోషంలో ఉన్నాడు.

కానర్‌ స్పందిస్తూ.. '' ఒకవైపు మహమ్మారి బయపెడుతుంది.. మరోవైపు నాకు మానసిక ఒత్తిడి ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. మానసిక ప్రశాంతతను పొందడానికి లేక్‌ మిషిగాన్‌ను ఏంచుకున్నాను. 365 రోజులుగా నదిలో దూకుతున్న ప్రతీసారి కొత్తగానే కనిపించేది. అలా ఒక పనిని ఏడాది పాటు విజయవంతంగా పూర్తి చేశాను. ఈ ఏడాది వ్యవధిలో ఎన్నో జ్ఞాపకాలు మిగిలాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కానర్‌ చేసిన పని ఇప్పుడు అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు కానర్‌ను కలిసి ఒత్తిడి తగ్గించుకోవడం కోసం చిట్కాలు అడుగుతున్నారు. మరికొందరు మాత్రం అతనికి పనిపాటా లేక అలాంటి దారిని ఏంచుకున్నాడు. అంటూ కామెంట్లు చేశారు.

చదవండి: 10 నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు

చందమామపై బాంబులు ఎందుకు?

మరిన్ని వార్తలు