Chicago Mass Shooting: నరనరాన పేరుకుపోయిన హింస.. క్లాస్‌రూమ్‌లోనే అలాంటి వీడియోలు

5 Jul, 2022 17:15 IST|Sakshi

యువకుడు.. మొరటోడు.. హింసను ప్రేరేపించేలా ర్యాప్‌లు.. పైగా దూకుడు స్వభావం.. ఇవేం చాలవన్నట్లు పేరులోనే ‘క్రైమ్‌’ ఉంది అతనికి. చికాగో హైల్యాండ్‌ పార్క్‌లో జులై4న జరిగిన స్వాతంత్ర దినోత్స పరేడ్‌లో నరమేధం తాలుకా అనుమానితుడి ఫ్రొఫైల్‌ నుంచి పోలీసులు సేకరించిన ఆసక్తికర విషయాలు ఇవి. 

రాబర్ట్‌ బాబీ క్రైమో III(22).. చికాగో ఇల్లినాయిస్‌ హైల్యాండ్‌ పార్క్‌ పరేడ్‌ నరమేధంలో ఆరుగురిని మట్టుపెట్టడంతో పాటు 36 మందిని గాయపరిచాడన్న ఆరోపణల మీద అరెస్ట్‌ అయ్యాడు. అయితే అతని గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తూ పోయే విషయాలు తెలిశాయి. 

రాబర్ట్‌ బాబీ క్రైమో.. ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం కావొచ్చు. కానీ, అక్కడి ప్రజలకు మాత్రం అతనిలో పేరుకుపోయిన హింసాత్మక ప్రవర్తన గురించి చాలాకాలంగానే తెలుసు!. ఎలాగంటారా?.. ర్యాపర్‌ అయిన క్రైమో తన యూట్యూబ్‌ ఛానెల్స్‌ ద్వారా బాగా ఫేమస్‌.  హింసను ఉసిగొల్పే లిరిక్స్‌,  కాల్పులు, చావులు, హింసకు సంబంధించిన కంటెంట్‌నే ఎక్కువగా ప్రమోట్‌ చేస్తాడు అతను. 

కాల్పుల ఘటన తర్వాత అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతని ఛానెల్స్‌ మొత్తాన్ని యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ చేయించారు. సోషల్‌ మీడియా అకౌంట్లను తొలగించారు. అయినప్పటికీ.. అతనికి సంబంధించిన వీడియోలు కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ‘అవేక్‌ ది ర్యాపర్‌’ పేరుతో అతని వీడియోలన్నీ హింసను ప్రొత్సహించేవిగా ఉండడం గమనార్హం. 

క్రైమో వీడియోల్లో యూట్యూబ్‌ కూడా నిబంధనల ఉల్లంఘన కింద తీసేయని వీడియోలు చాలానే ఉన్నాయి. హెల్మెట్‌, బుల్లెట్‌ఫ్రూఫ్‌ కోట్‌ ధరించి తరగతి గదిలోనే యువతను రెచ్చగొట్టే వీడియోలు చాలానే తీశాడు అతను. ఒంటి నిండా టాటూలతో విచిత్రమైన వేషధారణలతో ర్యాప్‌లు కడుతూ.. వాటి లిరిక్స్‌లోనూ తనలో పేరుకుపోయిన హింసా ప్రవృత్తిని చూపిస్తుంటాడు అతను. 

హోండా ఫిట్‌ కారు రూఫ్‌టాప్‌ నుంచి హై పవర్డ్‌ రైఫిల్‌తో క్రైమో కాల్పులు జరిపాడన్నది హైల్యాండ్‌ పార్క్‌ పోలీసులు వాదన. ఇక ఘటన జరిగిన తర్వాత.. సుమారు ఐదు మైళ్ల పాటు రాబర్ట్‌ను పోలీసులు ఛేజ్‌ చేశారని, ఆపై అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.  అమెరికాలో పేట్రేగిపోతున్న గన్‌ కల్చర్‌, ఇంటర్నెట్‌ కంటెంట్‌పై సరైన ఆంక్షలు, నియంత్రణ లేకపోవడం.. మరో యువకుడితో మారణ హోమం సృష్టించిందన్న వాదన వినిపిస్తోంది ఇప్పుడు. ఇలాంటి వాళ్లను ముందస్తుగానే గుర్తించి.. నిలువరిస్తే నరమేధాలు జరగవన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు