చికెన్‌ కోసం పోటెత్తిన జనం.. షాపులు మొత్తం ఖాళీ! 30 శాతం పెరగనున్న ధరలు, కారణమిదే..

31 May, 2022 21:28 IST|Sakshi

సింగపూర్‌: మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్‌ ధరలు భగ్గుమనేలా ఉన్నాయి. ఈనేపథ్యంలో జనం చికెన్‌ కోసం సూపర్‌మార్కెట్లు, మాంసం దుకాణాలకు పోటెత్తారు. రేపటి నుంచి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఇదే అదనుగా మాంస ప్రియులు పెద్ద మొత్తాల్లో కోడి మాంసాన్ని కొనుగోలు చేశారు. దీంతో చాలా మాంసం కొట్లు నో స్టాక్‌ బోర్డులు పెట్టేశాయి. జూన్‌ 1 నుంచి మలేసియా చికెన్‌ ఎగుమతులపై నిషేధం విధించడంతో ఈ పరిస్థితి తలెత్తిత్తింది. 

స్వదేశంలో కోడి మాంసం డిమాండ్‌, సరఫరా చైన్‌ను స్థిరీకరించేందుకు మలేసియా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు 3.6 మిలియన్‌ కోళ్ల ఎగుమతిని నిలుపుదల చేస్తున్నామని గతవారం ప్రధాని ఇస్మాయిల్‌ సబ్రీ యాకోబ్‌ తెలిపారు. దేశంలో చికెన్‌ సరఫరా పెంచి ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. 
చదవండి👉 కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే.. ఒక్కసారిగా

మలేసియా పౌల్ట్రీపైనే సింగపూర్‌ చికెన్‌ వ్యాపారం మూడోవంతు ఆధారపడి ఉంది. ఇక మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 శాతం వరకు రేట్లు పెరుగుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జనం మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. మరోవైపు కోడి మాంసం సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని సింగపూర్‌ ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. చికెన్‌ ప్రత్యామ్నాయ మాంసంవైపునకు కూడా మళ్లాలని ప్రజలకు సూచించింది.
చదవండి👉ఒక్క అడుగు అటువైపు వేసిఉంటే నుజ్జునుజ్జు అయ్యేవాడే.. భయంగొలిపే వీడియో!

మరిన్ని వార్తలు