Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్‌ వేవ్‌ ఆపటం కష్టం’

22 May, 2021 12:42 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం విమర్షలు

ప్రస్తుత ప్రభుత్వాన్ని నిద్రలేపాల్సిన అవసరం ఉంది

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్​ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు. వైరస్​ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై లేఖల్లో పేర్కొంటున్నారు. అయితే తాజాగా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ కాంగ్రెస్‌ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం విమర్షలు గుప్పించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం ఆయన ట్విటర్‌లో స్పందించారు.

కరోనా సెకండ్ వేవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని మండిపడ్డారు. కోవిడ్‌ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు గుర్తుచేశారు. భవిష్యత్తుల్లో కరోనా పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

పిల్లలకు అందించే చికిత్స, వ్యాక్సినేషన్‌ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రస్తుత ప్రభుత్వాన్ని నిద్రలేపాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయకపోతే రాబోయే కరోనా మూడో దశను కూడా నివారించడం సాధ్యం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
(చదవండి: కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసుల దాడి: బాలుడు మృతి)

మరిన్ని వార్తలు