Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..

4 Feb, 2023 15:10 IST|Sakshi

శాన్‌టియాగో: చీలి దేశంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వేసవిలో వేడిగాలులకు అగ్గి రాజుకొని అడువులు తగలబడిపోతున్నాయి మొత్తం 151 చోట్ల కార్చిచ్చు ఘటనలు వెలుగుచూశాయి. వాటిలో 65 చోట్ల మంటలను అదపుచేశారు.

బుధవారం నుంచి వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా 35 వేల ఎకరాలు బూడిదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 13 మంది మరణించినట్లు వివరించారు. మృతుల్లో ఓ హెలికాప్టర్ పైలట్‌తో పాటు మెకానిక్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరు ఓ ప్రాంతంలో మంటలను అదుపు చేసేందుకు వెళ్లి  హెలికాఫ్టర్ క్రాష్ అయి చనిపోయినట్లు పేర్కొన్నారు.

మరోవైపు కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. హెలికాఫ్టర్ ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టింది. కార్చిచ్చు నేపథ్యంలో చీలి అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తన వెకేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ అత్యవసర పరిస్థితిలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్చిచ్చును విపత్తుగా ప్రకటించారు. దీంతో సైన్యం కూడా రంగంలోకి సహాయక చర్యలు చేపట్టింది.

2017లో కూడా చీలిలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అప్పుడు 11 మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. 1500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,15,000 ఎకరాల అటవీప్రాంతం కాలిబూడిదైంది.
చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు..

మరిన్ని వార్తలు