అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే.. కిడ్నాప్‌ గురించి తెలియదు

7 Sep, 2020 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య డ్రాగన్‌ దళాలు గత వారం ఐదుగురు భారతీయులను సరిహద్దుల దగ్గర నుంచి కిడ్నాప్ చేశాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే సెప్టెంబర్ 5న ట్వీట్ ద్వారా మొదటిసారి ఈ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దీని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయుల అదృశ్యం గురించి చైనా సైన్యానికి హాట్‌లైన్ మెసేజ్ పంపించామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం. ‘ఆ ప్రాంతంలో ఐదుగురు భారతపౌరుల అదృశ్యం గురించి భారత సైన్యం పీఎల్ఏకు సందేశం పంపించిందనే దాని గురించి కూడా మా దగ్గర ఎటువంటి వివరాలు లేవు’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిజియన్ జావో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా.. అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేసింది. (చదవండి: ఆగని డ్రాగన్‌ ఆగడాలు)

వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్‌కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో...ఈ విషయం వెలుగు చూసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 37-పసిఘాట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ ట్విటర్‌లో ‘కొన్ని నెలల ముందు, ఇలాంటి సంఘటన జరిగింది. మరోమారు పునరావృతం అయ్యింది. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలి’ అని ట్వీట్‌ చేయడంతో అని ఈ విషయం మొదట వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అపహరించారని.. జిల్లాలోని నాచో గ్రామం నుంచి పీఎల్‌ఏ వారిని కిడ్నాప్ చేసిందని ఎరింగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు