మరి.. అమెరికా నిఘా బెలూన్ల సంగతేంటి?.. చైనా గగనతలంలో ఏకంగా పది బెలూన్లా!

13 Feb, 2023 15:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా, చైనాల మధ్య పరిస్థితులు నానాటికీ ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఈ అంశంతో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇరు దేశాలు. అవి నిఘా బెలూనలు కాదని, సాధారణ పరిశోధనల కోసం ప్రయోగించిన బెలూన్లని, అమెరికా ఉత్తపుణ్యానికే కూల్చేసిందని చైనా మండిపడుతోంది. మరోవైపు అమెరికా మాత్రం చైనా బెలూన్ల వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకుంటోంది. ఇక.. 

తాజాగా అమెరికాకు కౌంటర్‌ ఇచ్చింది చైనా. తమ గగనతలంలోనూ అమెరికా నిఘా బెలూన్స్‌ సంచరించాయని చైనా సోమవారం ఆరోపించింది. జనవరి 2022 నుంచి ఇప్పటిదాకా తమ గగనతలంలోకి ఏకంగా పది నిఘా బెలూన్లను అమెరికా పంపిందని పేర్కొంది. అక్రమంగా ఇతర దేశాల గగనతలంలోకి చొరబడడమూ అమెరికాకు కొత్తేం కాదు అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ బెన్‌బిన్‌ పేర్కొన్నారు. 

చైనా అధికార యంత్రాంగం అనుమతులు లేకుండానే మా(చైనా) భూభాగంలోకి అమెరికా బెలూన్లు వచ్చాయి. మరి వాటి సంగతి ఏంటి?. అలాగని వాళ్లలాగా తొందరపాటు చర్యలకు మేం దిగబోం. ఈ పరిస్థితిని బాధ్యతాయుతంగా, ప్రొఫెషనల్‌గా హ్యాండిల్‌ చేస్తాం. చైనా గగనతలంలో అమెరికా ఎయిర్‌బెలూన్ల సంచారం గురించి అదనపు సమాచారం కావాలంటే.. వెళ్లి వాళ్లను(అమెరికా)ను ఓసారి సంప్రదించండి అంటూ వ్యాఖ్యానించారు వాంగ్‌ బెన్‌బిన్‌.  ఈ ఆరోపణలపై అమెరికా స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు