జనవరి 21 తర్వాత పరిస్థితేంటో! చైనా కోవిడ్ కేసుల ప్రభావం యూరప్ పైన ఉంటుందా?

11 Jan, 2023 18:10 IST|Sakshi

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు.

చైనాలో పరిస్థితి ఏమిటి? 
‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో,  గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. 

ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని  అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. 

అన్ని దేశాల్లో భయాలు 
చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్‌ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు,  రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్‌లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం.

ముందు జాగ్రత్త చర్యలు 
చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. 

మరి యూరప్ మాటేమిటి?
పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్  పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై  డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు.

అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు.

మరిన్ని వార్తలు