భారత్‌ ప్రతిపాదనకు నో.. లష్కరే ఉగ్రవాది షాహిద్‌కు చైనా అండ!

19 Oct, 2022 13:19 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్‌ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్‌ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్‌ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్‌, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్‌ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ షాహిద్‌ మహమూద్‌, మహుమ్మద్‌ సార్వర్‌ల‌పై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. 

ఎవరీ షాహిద్‌?
అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం..  షాషిద్‌ మహమూద్‌ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్‌ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్‌ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్‌ ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌ఐఎఫ్‌)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్‌, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్‌ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు.

ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్‌స్కీ ట్వీట్‌

మరిన్ని వార్తలు