అంతర్జాతీయ నిబంధనలను కొన్ని దేశాలే నిర్దేశించలేవు

26 Oct, 2021 05:24 IST|Sakshi

ఐక్యరాజ్యసమితిని అందరూ గౌరవించాలి

చైనా అధినేత జిన్‌పింగ్‌ హితవు

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన అంతర్జాతీయ చట్టానికి ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి మినహాయింపులు లేకుండా కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ నిబంధనలను ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి అధికారాన్ని అందరూ ఆమోదించాలని, సమితి పట్ల నిబద్ధులై ఉండాలని హితవు పలికారు. చైనాను ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రత్యేక సదస్సులో జిన్‌పింగ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ నిబంధనలను ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు.

ఇందులో మరో మాటకు తావు లేదని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు లేదా కొన్ని దేశాల కూటములు ఈ పని చేయలేవని పరోక్షంగా అమెరికాకు చురక అంటించారు. సమితిని గౌరవించాలని ప్రపంచ దేశాలకు జిన్‌పింగ్‌ సూచించారు. సమితిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని అన్నారు.

మరిన్ని వార్తలు