China’s Bullet Train Crashes: రియల్‌ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!

7 Jun, 2022 14:33 IST|Sakshi

తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్‌ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్‌ యోంగ్‌. 

దక్షిణ చైనాలో హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్‌ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్‌ కోచ్‌ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్‌ యాంగ్‌ యోంగ్‌ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్‌ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. 

డీ2809 రైలు.. గుయియాంగ్‌ నుంచి రోంగ్‌జియాంగ్‌ స్టేషన్‌ల మధ్య ఒక టన్నెల్‌ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్‌ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్‌ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్‌ కోచ్‌ బాగా డ్యామేజ్‌ అయ్యింది. 

యోంగ్‌ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్‌రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు.  

యోంగ్‌ నేపథ్యం.. 
ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్‌ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్‌ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్‌ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్‌ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. 

యోంగ్‌ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్‌ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్‌ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది.

మరిన్ని వార్తలు