భూమిని చేరిన చంద్రుడి మట్టి నమూనాలు

18 Dec, 2020 04:47 IST|Sakshi
నమూనాలను తెచ్చిన క్యాప్సూ్యల్‌ వద్ద పరిశోధకుడు

బీజింగ్‌: చైనా ప్రయోగించిన ఛాంగీ – 5 సేకరించిన జాబిల్లి నమూనాలు గురువారం విజయవంతంగా భూమిని చేరాయి. ఛాంగీ–5 శోధక నౌక గురువారం తెల్లవారుజామున 1.59 గంటల సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలోని ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజన్‌లోని సిజీవాంగ్‌ బానర్‌లో ల్యాండ్‌ అయినట్లు చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. ఛాంగీ–5 ప్రయోగం విజయవంతం కావడంతో జాబిల్లి కేంద్రంగా చైనా జరిపిన మూడు ప్రయోగాలు కాస్తా పూర్తయినట్లు అయింది. దాదాపు ఎనిమిది టన్నుల బరువున్న ఛాంగీ –5ను నవంబర్‌ 24న ప్రయోగించారు. జాబిల్లి నమూనాలతో కూడిన ఛాంగీ–5 భాగం అట్లాంటిక్‌ మహా సముద్రంపై సుమారు 5,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన నౌక నుంచి విడిపోయింది.

సుమారు 120 కిలోమీటర్ల ఎత్తులో భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఈ భాగపు పారాచూట్‌ పది కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకుంది. ఆ తరువాత ముందుగా నిర్ణయించిన ప్రాంతంలో నమూనాలతో కూడిన భాగం ల్యాండ్‌ అయ్యింది. నమూనాతో కూడిన క్యాప్సూల్‌ను బీజింగ్‌ తీసుకెళ్లి అక్కడే తెరుస్తారని సీఎన్‌ఎస్‌ఏ తెలిపింది. ఇతర దేశాల శాస్త్రవేత్తలకూ ఈ నమూనాల్లో కొన్నింటిని పరిశోధనలకు అందుబాటులో ఉంచుతామని సీఎన్‌ఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్‌ పీ ఝా యూ తెలిపారు.  
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు