చంద్రుడి మట్టిని పట్టిన చాంగె–5

3 Dec, 2020 05:01 IST|Sakshi

40 ఏళ్లలో మొదటిసారి

బీజింగ్‌: చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె–5 చంద్రుడి మీద మట్టిని సేకరించిందని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రుడి మీద ఉన్న ఓసియానుస్‌ ప్రొసెల్లారమ్‌ అనే ప్రాంతంనుంచి చాంగె–5 మట్టిని సేకరించింది. ఈ సేకరణలో భాగంగా ల్యాండర్‌ రెండు మీటర్ల లోతులోని మట్టిని సేకరించిందని చెప్పారు. మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. దాదాపు రెండు కేజీల మట్టిని సేకరించిందని తెలిపారు.

చంద్ర ఉపరితలం నుంచి, అలాగే లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించామని తెలిపారు. మొదటిసారే విజయం సాధించడం గమనార్హం. దీనిపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ చైనా స్పేస్‌ ఏజెన్సీకి అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ పరిశోధనా కమ్యూనిటీ ద్వారా కొన్ని శాంపిళ్లపై పరిశోధన చేసే అవకాశం తమకూ రావచ్చని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సైన్స్‌ కమ్యూనిటీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పింది. చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్‌ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు