చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా?

21 May, 2023 12:56 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో చాట్ జీపీటీని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా ఎర్నీ బోట్‌ అనే అనే ఏఐ చాట్‌బోట్‌ను బీజింగ్‌కు చెందిన బైడు అనే టెక్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చాట్‌బోట్‌పై కూడా చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం గమనార్హం. చైనా అధ్యక్ష‍ుడు షీ జిన్ పింగ్ గురించి గానీ, కరోనాకు సంబంధించి విషయాలు గానీ యూజర్లు అడిగితే.. ఎర్నీ బోట్ తప్పుడు సమాధానాలు ఇస్తోంది. అంతేకాదు జిన్‌పింగ్‌ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా,  అభ్యంతకర ప్రశ్నలు అడిగినా.. ఆ యూజర్లు మరోసారి ప్రశ్నలు అడగకుండా శాశ్వతంగా బ్యాన్ చేస్తోంది.

ఎర్నీ బోట్ పనితీరును పరీక్షించేందుకు సీఎన్‌బీసీ రిపోర్టర్ ఒకరు పలు ప్రశ్నలు సంధించారు. కోవిడ్‌-19 మూలాలు ఎక్కడున్నాయ్..? అతని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానంగా.. 'కరోనా మూలాలపై ఇంకా శాస్త్రీయ పరిశోధన జరుగుతోంది' అని బదులిచ్చింది.

కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మొదటి కేసు వెలుగు చూసింది అక్కడే. వుహాన్‌ల్యాబ్‌లోనే కరోనాను సృష్టించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఎర్నీ బోట్ మాత్రం ఇందుకు సంబంధించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. తప్పుడు సమాధానం ఇచ్చింది.

చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌కు, విన్నీ పూహ్‌కు మధ్య సంబంధం ఏంటి? అని రిపోర్టర్ మరో ప్రశ్న అడగ్గా.. ఎర్నీబోట్ ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. అనంతరం రిపోర్టర్ మరో ప్రశ్న అడగకుండా అతడ్ని డిసేబుల్ చేసింది.

విన్నీ ది ఫూహ్ అనేది ఓ కార్టూన్. ఇది జిన్‌ పింగ్‌ను పోలి ఉంటుంది. అందుకే అదంటే జిన్‌పింగ్‌కు అస్సలు నచ్చదు. 2013 నుంచి జిన్‌పింగ్, విన్నీ పూహ్‌లను పోల్చడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను జిన్‌పింగ్ కలిసిప్పటి నుంచి ఇది మొదలైంది. వీరిద్దరు కలిసి నడుస్తున్న ఫొటోను ఓ అమెరికా కళాకారుడు కార్టూన్‌ రూపంలో తీర్చిదిద్దగా.. అందులోని విన్నీ పూహ్‌ బాగా పాపులర్ అయింది. 2017 నుంచి ఈ కార్టూన్‌తో ప్రచురితమయ్యే ఫొటోలను, కంటెంట్‌ను చైనా సెన్సార్‌ కూడా చేస్తోంది.
చదవండి: భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?

మరిన్ని వార్తలు