China Citizens On Lockdowns: లాక్‌డౌన్‌ వద్దు.. భరించలేం... గగ్గోలు పెడుతున్న చైనా ప్రజలు

6 Jun, 2022 19:49 IST|Sakshi

Why Lock Us In A Cage?: చైనా గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిపోయింది. జీరో కోవిడ్‌ పాలసీని విచ్చిన్నం చేస్తూ అనుహ్యంగా పెరుగుతున్న కేసులతో చైనా బెంబేలెత్తిపోయింది. బాబోయ్‌ హోం క్వారంటైన్‌లో ఉండమని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కఠిన ఆంక్షలు కొరడాని ఝళిపించి మరీ ప్రజలను నిర్భంధించింది. ఐతే గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో చైనా వాసులు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలే వరుస లాక్‌డౌన్‌లతో మగ్గిపోయిన చైనా వాసులను ఆ పేరు వింటేనే హడలిపోతున్నారు.

ఇక తమ వల్ల కాదని తేల్చి చేప్పేశారు కూడా. కానీ చైనా అధికారులు మాత్రం కరోనా తగ్గిందని బహిరంగా ప్రదేశాల్లో తిరిగేతే ఊరుకోమని గట్టిగా చెప్పేశారు. ఈ మేరకు చైనా కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు సడలించినప్పటికీ ఇంకా వేలాది మంది నిర్బంధంలోనే ఉన్నారు. 'ఇక మా వల్ల కాదు, ఇంకా ఎన్నాళ్లు మేము ఇలా బోనుల్లోని జంతువుల మాదిరి ఉండాలంటూ' ప్రజలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. కేసులు పెరగకూడదంటే ఆంక్షలు తప్పదనే నొక్కి చెబుతోంది.

ప్రస్తుతం చైనాలో అధికారులు కొన్నిచోట్ల ఆంక్షలు సడలించటంతో ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వెళ్తున్నారు. అలాగే పాఠశాలలను కూడా దశల వారీగా తిరిగి ప్రారంభించారు. ఐతే కేసుల శాతం తక్కువగా ఉన్నప్రాంతాల్లోనే ఈ ఆంక్షలను సడలించారు. కానీ షాంఘైలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర కరోనా ఆంక్షలు అమలు చేస్తోంది. ఒక పక్క ప్రజలు భరించలేమని చెబుతున్నా...చైనా మాత్రం కేసులు పెరగకూడదనే ఇలా చేస్తున్నామంటూ బలవంతంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు రుద్దుతోంది.

(చదవండి:  నూపుర్‌ కామెంట్లతో ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’)

మరిన్ని వార్తలు