నైకీ, హెచ్‌అండ్‌ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్‌

8 Jun, 2021 10:30 IST|Sakshi

విదేశీ బొమ్మలు, దుస్తులు హానికరం

వీగర్‌లో అణిచివేతలను కంపెనీలు ఖండించిన నేపథ్యం

బీజింగ్‌: వీగర్‌ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్‌ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్‌అండ్‌ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్‌ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం  సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్‌బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్‌ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్‌ ప్రావిన్స్‌ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది.

షాంజియాంగ్‌ ప్రావిన్స్‌లో వీగర్‌ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్‌అండ్‌ఎం ఇకపై షాంజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్‌ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి హెచ్‌అండ్‌ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్‌ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్‌కి సంబంధించిన యాప్స్‌ను కూడా యాప్‌ స్టోర్స్‌ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా,  హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు.

మరిన్ని వార్తలు