ఎలన్‌ మస్క్‌ కొంప ముంచే పనిలో చైనా.. ఏకంగా శాటిలైట్‌లను నాశనం చేస్తామని ప్రకటన!

27 May, 2022 09:58 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు చైనాతో ఉన్న సత్సంబంధాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన సారథ్యంలోని శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల సంస్థ స్టార్‌లింక్‌ను నాశనం చేసేందుకు ప్లాన్‌ గీసుకుంది. ఈ మేరకు చైనా నుంచే అధికారిక సంకేతాలు వెలువడడం గమనార్హం. 

ఇప్పటికే రష్యా స్పేస్‌ ఏజెన్సీ.. ఉక్రెయిన్‌ సాయం విషయంలో ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ సేవలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే స్టార్‌లింక్‌ శాటిలైట్‌లను కూల్చేయాలని చైనా భావిస్తోంది. ప్రపంచంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్లో అత్యంత చౌకైన సర్వీస్‌లు అందిస్తోంది ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌. ఒకవేళ తమ జాతీయ భద్రతకు గనుక హాని కలిగించేవిగా పరిణమిస్తే.. స్టార్‌లింక్‌ శాటిలైట్‌లను ముందువెనకా ఆలోచించకుండా కూల్చేస్తామని చైనా మిలిటరీ ప్రకటించింది. ఈ మేరకు అధ్యయనంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. 

అంతేకాదు స్టార్‌లింక్‌ శాటిలైట్‌పై నిఘా ఉంచాలని, నిరంతరం పర్యవేక్షణ అవసరం ఉందని చైనా సైంటిస్టుల అభిప్రాయాలను సైతం ప్రచురించింది. ఈ అధ్యయనానికి బీజింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాకింగ్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ రీసెర్చర్‌ రెన్‌ యువాన్‌జెన్‌ నేతృత్వం వహించారు. స్టార్‌లింక్‌ సేవలు.. అమెరికా డ్రోన్స్‌, ఫైటర్‌ జెట్స్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ను వేగాన్ని(దాదాపు వంద రెట్ల వేగం) పెంచుతోందన్న ప్రచారం నేపథ్యంలో.. చైనా మిలిటరీ రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు. 

ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నాడు. లో-ఎర్త్‌ ఆర్బిట్‌లో చిన్న చిన్న శాటిలైట్లను ప్రవేశపెట్టడం ద్వారా.. ఈ భూమ్మీద బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది స్టార్‌లింక్‌. 

స్టార్‌లింక్ వేలాది చిన్న ఉపగ్రహాలతో కూడి ఉంది. ఒకవేళ ముప్పు పొంచి ఉందని భావిస్తే.. వాటన్నింటినీ నాశనం చేయాలనేది చైనా ప్రణాళిక. క్షిపణులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. కాబట్టి, చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి లేజర్‌లు, మైక్రోవేవ్ టెక్నాలజీ లేదంటే చిన్న ఉపగ్రహాలను, స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కట్టడికి కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. దీనిపై మస్క్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి మరి!.

చదవండి: మస్క్‌ నాతో నీచంగా ప్రవర్తించాడు!

మరిన్ని వార్తలు