చైనా కరోనా స్వదేశీ వ్యాక్సిన్ల ప్రదర్శన

7 Sep, 2020 19:37 IST|Sakshi

ఏడాది చివరికి నాటికి 3వ  దశ ఫలితాలు 

బీజింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలు పోటీ పడుతున్న సమయంలో, చైనా తన తొలి వ్యాక్సిన్‌లను ప్రదర్శనకు పెట్టింది. బీజింగ్ లో నిర్వహిస్తున్న ట్రేడ్ ఫెయిర్‌లో సోమవారం స్వదేశీ వ్యాక్సిన్‌లను తొలిసారి ప్రదర్శించింది. దశ-3 ట్రయల్స్‌లో ప్రవేశించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు10 వ్యాక్సిన్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి మార్కెట్‌లో రానున్నాయని తయారీదారుల అంచనా. 

చైనా కంపెనీలైన సినోవాక్ బయోటెక్, సినోఫార్మా ఈ టీకాని  అభివృద్ధి చేస్తున్నాయి. టీకా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించామనీ, ఏడాదికి 300 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం  ఉందని సినోవాక్‌ ప్రతినిధి వెల్లడించారు. సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద అందజేసినట్టు సినోవాక్ సీఈఓ‌ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. టీకా తీసుకున్న వారిలో తన భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో దుష్ప్రభావాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు.

మరోవైపు 1957లో అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన సోవియట్ ఉపగ్రహం ‘స్పుత్నిక్ వి’ పేరుతో తమ తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా గత నెలలో పేర్కొంది. కాగా క్లినికల్ ట్రయల్స్‌‌లో వ్యాక్సిన్‌లు సురక్షితమైనవని, సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిరూపితమైనా ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ టీకాకు తుది ఆమోదం లభించని సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు