పాక్‌, నేపాల్‌, అఫ్గాన్‌లకు అండగా చైనా

28 Jul, 2020 10:03 IST|Sakshi

పాక్‌, అఫ్గాన్‌, నేపాల్‌తో చైనా సమావేశం

నాలుగు అంశాల ప్రణాళిక

కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం

బీజింగ్‌: మహమ్మారి కరోనాపై పోరులో పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, నేపాల్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చైనా తెలిపింది. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రాణాంతక కోవిడ్‌​-19 కట్టడికై పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అఫ్గనిస్తాన్‌, నేపాల్‌, పాకిస్తాన్‌ మంత్రులతో సోమవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మారిపై పోరులో నాలుగు దేశాలు ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాజకీయాలు, విమర్శలకు తావు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంతో ఐకమత్యంగా వైరస్‌ అంతానికి కృషి చేయాలన్నారు.(చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌కు మరిన్ని ప్రయోజనాలు!)

అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. చైనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుందని.. పాక్‌, బంగ్లా, అఫ్గానిస్తాన్‌లకు ఈ టీకాను అందజేసి మహమ్మారిని అంతం చేసి, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరోనా కనుమరుగైన పోయిన తర్వాత చైనాకు అత్యంత ప్రాధాన్యాంశంగా ఉన్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మూడు దేశాలు సహకరించాలని వాంగ్‌ యీ విజ్ఞప్తి చేశారు. పనుల పునరుద్ధరణ, ఉత్పత్తి విషయంలో అండగా ఉండాలని.. తద్వారా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోవచ్చని పేర్కొన్నారు. మధ్య ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు తాము కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. (‘చైనా, పాక్‌ రహస్య ఒప్పందాలు’)

చైనాకు మద్దతు... ఇప్పటికే
ఈ సమావేశంలో విదేశాంగ మంత్రులు మహ్మద్‌ అత్మార్‌ హనీఫ్‌(అఫ్గాన్‌), ప్రదీప్‌ కుమార్‌ గ్యావాలి(నేపాల్‌), పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీ తరఫున ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి మఖ్దూం ఖుస్రో భక్తియార్‌ పాల్గొన్నారు. ఇక చైనా ప్రతిపాదించిన నాలుగు అంశాల ప్రతిపాదనకు మూడు దేశాలు సమ్మతించాయి. అదే విధంగా కరోనా కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపాయి. కాగా భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా- పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపెక్‌- పీఓకే గుండా).. అదే విధంగా ట్రాన్స్‌ హిమాలయన్‌ కనెక్టివిటీ నెట్‌వర్క్‌(టీహెచ్‌సీఎన్‌- టిబెట్‌ గుండా చైనా- నేపాల్‌ల మధ్య అనుసంధానానికై) గురించి చర్చించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌ను పూర్తిగా తనవైపునకు తిప్పుకొన్న డ్రాగన్‌.. తాజాగా భారత్‌ సరిహద్దు, మిత్ర దేశాలతో ఈ మేరకు భేటీ నిర్వహించడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (మేడిన్‌ చైనా రామాయణం)

భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలైన లిపులేఖ్‌, లింపియదుర, కాలాపానీలను నేపాల్‌ తన భూభాగంలోకి కలుపుతూ కొత్త మ్యాప్‌లు విడుదల చేయడం సహా న్యూఢిల్లీకి వ్యతిరేకంగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో డ్రాగన్‌ హస్తం ఉందనే అనుమానాలు తాజా భేటీతో మరింత బలపడ్డాయి. అదే విధంగా గల్వాన్‌ లోయలో భారత్‌ సైనికులకు పొట్టనబెట్టుకున్న చైనా.. ఆ మరుసటి రోజే బంగ్లాదేశ్‌కు వాణిజ్య ఒప్పందం కుదుర్చకున్న సంగతి తెలిసిందే. ఇక అఫ్గాన్‌తో సైతం సత్సంబంధాలు కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా.. చైనా, డబ్ల్యూహెచ్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అఫ్గాన్‌ తాలిబన్లు, దక్షిణ చైనా సముద్ర జలాల విషయంలో అగ్రరాజ్య వైఖరి తదితర అంశాల నేపథ్యంలో డ్రాగన్‌ ఈ మేరకు భేటీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు