ఒక్కసారి చార్జ్‌ చేస్తే.. 1,000 కి.మీ. ప్రయాణం

12 Jan, 2021 08:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్‌లోకి మరో విద్యుత్‌ కారు రాబోతోంది. ప్రఖ్యాత టెస్లా కార్ల కంపెనీకి పోటీగా చెప్పుకుంటున్న చైనా కంపెనీ నియో ‘ఈటీ7’పేరుతో కొత్త కారును ఆవిష్కరించింది. అయితే.. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పలు విద్యుత్‌ కార్ల మాదిరిగా మాత్రం కాదండోయ్‌! దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి.. ముందుగా చెప్పుకోవాల్సింది దీని మైలేజీ గురించే.. ఒకసారి చార్జ్‌ చేస్తే ఎకాఎకిన ఈ కారు 621 మైళ్లు ప్రయాణిస్తుంది. అంటే.. దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇందుకోసం ఈటీ7లో 150 కిలోవాట్‌/గంటల బ్యాటరీని ఏర్పాటు చేశారు. అలాగే అవసరమైనప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీలను మార్చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో పనిచేసేటప్పుడు ఈ కారు 480 కిలోవాట్లు లేదా 643 హార్స్‌పవర్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోనూ 180 కిలోవాట్లు ముందు చక్రాల ద్వారా పుడితే వెనుక చక్రాల ద్వారా 300 కిలోవాట్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. కేవలం 3.9 సెకన్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. కారు మొత్తమ్మీద దాదాపు 33 కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్నివైపులా చూసేందుకు ఇందులో 11.9 మెగాపిక్సెళ్ల సామర్థ్యమున్నవీ ఉన్నాయి. 

దీంతో పాటు హై రెజల్యూషన్‌ లైడార్లు, 5 మిల్లీమీటర్ల వేవ్‌ రాడార్లు, 12 వరకు అల్ట్రాసానిక్‌ సెన్సార్లు, 2 పొజిషినింగ్‌ యూనిట్లు, వీ2ఎక్స్, ఏడీఎంఎస్‌లతో ఈ ఈటీ7ను డ్రైవర్‌ అవసరం లేకుండా కూడా నడిపేందుకు అవకాశముంది. ఈ సెన్సార్లు, కెమెరాలన్నీ కలిపి ప్రతి సెకనుకు 8 గిగాబైట్ల సమాచారం ఉత్పత్తి చేస్తుంటే వీటిని ప్రాసెస్‌ చేసేందుకు ఎన్‌విడియా డ్రైవ్‌ ఓరిన్‌ ప్రాసెసర్లు 4 ఉపయోగిస్తారు. టెస్లా కారులో వాడే కంప్యూటింగ్‌ శక్తికి ఇది 7 రెట్లు ఎక్కువ. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఈ ఈటీ7 మార్కెట్‌లోకి రానుంది. ఈ కార్లకు అవసరమైన బ్యాటరీలను చార్జ్‌ చేసేందుకు నియో పవర్‌ స్వాప్‌ 2.0 పేరుతో ఓ వ్యవస్థను సిద్ధం చేసింది. రోజుకు 312 బ్యాటరీలను చార్జ్‌ చేయగలగడం దీని ప్రత్యేకత.

మరిన్ని వార్తలు