తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్‌

5 Aug, 2022 10:43 IST|Sakshi

బీజింగ్‌: తైవాన్‌ జలసంధిపై క్షిపణులతో విరుచుకుపడింది చైనా. ఈ చర్య అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. చైనా సైన్యంపై తైవాన్ సమీపంలో బాంబులు కురిపించిన వీడియోనూ ఆ దేశ అధికారిక మీడియా సీసీటీవీ విడుదల చేసింది. ఈ దృశ్యాలు ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశాయి.  డాంగ్‌ఫెండ్‌ క్షిపణులను కురిపించి తమ సేనలు అనుకున్న ఫలితాలు సాధించాయని చైనా సైన్యం ప్రకటించింది.

సైనిక క్రీడల్లో భాగంగా చైనా తన అధునాతన యుద్ధవిమాన వాహక నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను తైవాన్‌ జలసంధిలోకి ప్రవేశపెట్టింది. తైవాన్‌లోని జపాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి. ‘మేం ఏం చెప్తామో అదే చేస్తాం’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి టాన్‌ కెఫీ వ్యాఖ్యానించారు. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 

విమాన సర్వీసులు రద్దు 
చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమై తైవాన్‌ తన పౌర విమానాల రాకపోకలను వెనువెంటనే ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్‌పోర్ట్‌ నుంచి దాదాపు 50 విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి. ప్రపంచవిపణిలో అత్యంత కీలకమైన ప్రాసెస్‌ చిప్స్‌ల సముద్రమార్గ రవాణా కొనసాగుతోందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చైనా సైనిక డ్రిల్స్‌ చేస్తున్న అదే ప్రాంతానికి సమీపంలోకి అమెరికా పీ–8ఏ పోసిడాన్‌ గస్తీ విమానం, ఎంహెచ్‌–60ఆర్‌ జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్‌లు వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచాయని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ఒక కథనంలో పేర్కొంది. తైవాన్‌ సైతం మిరాజ్, ఎఫ్‌–5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటుపై పర్యవేక్షణకు వెళ్లి వచ్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా చర్యను చట్టవిరుద్ధ, బాధ్యతారాహిత్య చర్యగా తైవాన్‌ అభివర్ణించింది. 

తైవాన్‌పై నోరు మెదపని పెలోసీ 
తైవాన్‌ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసిన పెలోసీ.. దక్షిణ కొరియా పర్యటనలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద.కొరియా పార్లమెంట్‌ స్పీకర్‌ కిమ్‌ జిన్‌ ప్యోను పెలోసీ కలిసినా తైవాన్‌ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ఉ.కొరియా ‘అణు’ ప్రమాదంపై చర్చించామని జిన్‌ చెప్పారు.
చదవండి: పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు!

మరిన్ని వార్తలు