భారత్‌ ఆరోపణలపై స్పందించిన చైనా

31 Aug, 2020 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా దళాలు తూర్పు లద్దాఖ్, ప్యాంగ్‌యాంగ్ త్సో‌ సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించినట్లు భారత్‌ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా దీనిపై స్పందించింది. తమ ఆర్మీ ఎల్‌ఏసీని దాటలేదని స్పష్టం చేసింది. భారత్‌తో తాజా సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ పీఎల్‌ఏ(పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) దళాలు ఎల్‌ఏసీని ఎప్పుడూ దాటలేదని తెలిపారు. సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయన్నారు. ఆగస్టు 29న ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ దళాలు.. డ్రాగన్‌ చర్యలను తిప్పికొట్టాయి. (చదవండి: చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్‌)

మే నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగిన దక్షిణ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో చైనా శిబిరాలను ఏర్పాటు చేయడమే కాక.. మౌళిక సదుపాయాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. చైనా కదలికలను గమనించిన భారత సైన్యం పీఎల్‌ఏ చర్యలను అడ్డుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు