టూమచ్‌: బూతు బొమ్మలు, వ్యభిచార ప్రకటనలతో నిరసనలపై ఉక్కు పాదం!

29 Nov, 2022 15:47 IST|Sakshi

బీజింగ్‌: సోషల్‌ మీడియా కాలంలో ఉద్యమాల్ని అణచివేయడం అంత తేలికనా?.. అవునని నిరూపిస్తోంది చైనా. కోవిడ్‌ కట్టడి పేరుతో అక్కడ అమలు అవుతున్న కఠోర లాక్‌డౌన్‌ ఇక తమ వల్ల కాదంటూ ఎదురు తిరిగిన ప్రజావేశాన్ని తొక్కిపెట్టేందుకు దుర్మార్గమైన ఆలోచనలను అమలు చేస్తోంది జిన్‌పింగ్‌ నేతృత్వంలోని సర్కార్‌. 

బోట్‌ పోలీస్‌, సెక్స్‌ బోట్స్‌.. ఇప్పుడు నిరసనల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న ఆయుధాలు. ప్రపంచమంతా కరోనా స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్న వేళ.. చైనా మాత్రం ఇంకా వైరస్‌ టెన్షన్‌తోనే వణికిపోతోంది. రోజుకు 30వేలకు పైగా కేసుల నమోదుతో.. జీరో కొవిడ్‌ పాలసీని.. అదీ అతికఠినంగా అమలు చేస్తుండడంతో జనం సహనం కోల్పోతున్నారు. 

చైనాలోని పదుల సంఖ్యలో నగరాల్లో.. కొవిడ్‌ ఆంక్షల వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరాయి. తమ గళాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్‌ మీడియా ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ, ఆ ఆన్‌లైన్‌ నిరసనలను అంతే సమర్థవంతంగా అణచివేస్తోంది కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం. చైనాలో పాపులర్‌ సోషల్‌ మీడియా అకౌంట్లలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సెన్సార్‌ చేస్తున్నారు అధికారులు. నిరసన, బీజింగ్‌, అల్లర్లు.. ఇలాంటి పదాలతో కూడిన పోస్టులు చేయకుండా.. పూర్తిగా బ్యాన్‌ చేసింది.  ఇందు కోసం పోలీస్‌ బోట్‌లను ఉపయోగించుకుంటోంది. 

అదే సమయంలో.. బయటి ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. ట్విటర్‌లో అయితే నిరసనల ప్రదర్శనల ఊసు లేకుండా చేస్తోంది. ట్విటర్‌ సెర్చింగ్‌లో..  చైనా నిరసనలు, బీజింగ్‌, ఇతర ప్రముఖల నగరాల కోసం వెతికితే.. ఆ ప్లేస్‌లో అందమైన మోడల్స్‌ ఫొటోలు, అశ్లీల వీడియోలు, బూతు బొమ్మలు, అడ్వర్‌టైజ్‌మెంట్‌లు దర్శనమిస్తున్నాయి. చైనీస్‌(మాండరిన్‌) భాషలో.. అదీ పెయిడ్‌ అడ్వర్‌టైజ్‌మెంట్‌ల ద్వారా ఆ పోస్టులు ట్రెండ్‌ అవుతుండడం గమనార్హం.  ఇది ఇక్కడితోనే ఆగలేదు.. 

అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ 2009లో ట్విటర్‌ను చైనా వ్యాప్తంగా బ్లాక్‌ చేసింది. అయితే కొందరు యూజర్లు వీపీఎన్‌, వెబ్‌సైట్‌ ప్రాక్సీ సర్వీసుల ద్వారా అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ట్విటర్‌లో ఇప్పుడు పెయిడ్‌ యాడ్స్‌ కనిపిస్తున్నాయి. అదీ పోర్న్‌ నుంచి వ్యభిచారం సంబంధించినవి ట్రెండ్‌ అవుతుండడం గమనార్హం. 

వీఛాట్‌ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇదే పరిస్థితి. నిబంధన ఉల్లంఘన పేరుతో నిరసనల పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ఏదైనా సరే.. ‘తప్పుడు సమాచారం’గా పేర్కొంటూ అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. తాజాగా.. గురువారం ఉరుమ్‌ఖ్వీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఈ నిఘా ఎక్కువైంది. అగ్ని ప్రమాద సమయంలో కరోనా లాక్‌డౌన్‌, బారికేడ్లు, వాహనాల అడ్డగింత ద్వారా సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా ప్రాణ నష్టం సంభవించగా.. కఠోర నిబంధనల అమలుపై ప్రజాగ్రహం పెల్లుబిక్కింది.

షుయిమోగావో జిల్లాలో ఓ యువకుడు సోషల్‌ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే.. అతన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ పదిరోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు చైనా అధికారులు. అదే సమయంలో నిరసనకారులపై వ్యతిరేక పోస్టులను, ప్రభుత్వ అనుకూల పోస్టులకు అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అనుమతి లభిస్తోంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి హావో లిజియన్‌ భార్య.. నిరసన కారులపై ఆగ్రహంతో చేసిన ఓ పోస్టు విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు